షుగర్ ఫ్యాక్టరీలను, డెయిరీని తెరిపించాలి: సీపీఐ
ABN, First Publish Date - 2021-10-22T05:28:24+05:30
ఎన్నికల ప్రచారంలో జిల్లాలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలు, డెయిరీలను తెరిపిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు.
మదనపల్లె అర్బన్, అక్టోబరు 21: ఎన్నికల ప్రచారంలో జిల్లాలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలు, డెయిరీలను తెరిపిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. మనదపల్లె పట్టణంలో జరిగిన పార్టీ డివిజన్ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పశ్నిస్తే భౌతికదాడులకు దిగడం, పోలీసు కేసులు బనాయిస్తున్నారన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాడరాని పదజాలం వాడితే ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం, ఇతర పార్టీల నాయకులు మాట్లాడితే వారిపై భౌతికదాడులకు దిగుతోందని విమర్శించారు. ఇక జిల్లాలో పాడి, చెరుకు రైతుల సమస్యలను మంత్రులు, శాసనసభ్యులు పట్టించుకోవడంలేదన్నారు. కుంటి సాకులు చూపి పింఛన్లు తొలగిస్తున్నారని విమర్శించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో ఉద్యమాలు చేపడతామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో అమూల్ కంపెనీ ప్రతినిధులు పాల సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో సీపీఐ జిల్లాస్థాయి కార్యదర్శుల వర్క్‌షాపులను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.జనార్దన్, పీఎల్ నరసింహులు, కృష్ణప్ప, మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:28:24+05:30 IST