‘మత్తు’లో వచ్చి దాడి చేశారు: పంచుమర్తి
ABN, First Publish Date - 2021-10-21T11:08:45+05:30
‘‘వైసీపీ గంజాయి పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో వచ్చి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ గంజాయి పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో వచ్చి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆ పార్టీకి గంజాయి మత్తు ఎంత ఎక్కిందో ఈ దాడి నిరూపించింది’’ అని దని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేత పట్టాభి అన్న మాటలకు ప్రతిగా ఈ దాడి జరిగిందని వైసీపీ నేతలు సిగ్గు లేకుండా సమర్థించుకొంటున్నారని, ఇంతకు పది రెట్లు మాటలు జగన్ అన్న విషయం ఆ పార్టీ నేతలకు గుర్తు లేదా? అంటూ ఉదాహరణల సహితంగా ప్రశ్నించారు. ‘‘వైసీపీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ అన్న మాటలను మర్చిపోయారా? ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ది నోరా! తాటిమట్టా? ఆయనకు కార్పొరేషన్ టిక్కెట్టు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. వాళ్ల అమ్మకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి ఎవరో మెప్పు కోసం ఆయన నోరు పారేసుకొంటున్నారు’’ అని అనురాధ విమర్శించారు. యూనిఫాం లేకుండా తమ కార్యాలయంలోకి చొరబడి, తిరుగుతున్న వ్యక్తిని పార్టీ కార్యకర్తలు పట్టుకొని, పోలీసు అధికారి అని తెలిసిన తర్వాత మర్యాదగా పంపేశారని చెప్పారు. అదేదో పెద్ద నేరం మాదిరిగా ఏకంగా లోకేశ్‌ను మొదటి నిందితునిగా పేర్కొంటూ కేసు పెట్టారని విమర్శించారు.
Updated Date - 2021-10-21T11:08:45+05:30 IST