పాఠం చెప్పని పెద్ద సార్లు
ABN, First Publish Date - 2021-02-23T08:01:06+05:30
లక్షల్లో జీతాలు! లక్షణమైన జీవనశైలి! కదిలితే, మెదిలితే కారు, ఫోను, ఎన్నెన్నో అలవెన్సులు! విశ్వవిద్యాలయాల్లో సీనియర్ ప్రొఫెసర్లకు ఇన్నిన్ని సౌకర్యాలు ఇస్తున్నా క్లాసులకు రారు. పాఠం చెప్పరు. అందరూ ఇలాగే ఉన్నారా అంటే కాదు. సింహభాగం
సొంత వ్యాపకాల్లో సీనియర్ ప్రొఫెసర్లు
నెలకు రూ. 2.50 లక్షలు, అలవెన్స్‌లు
అయినా బోధనకు ఆమడ దూరం
అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లతోనే కాలక్షేపం
పరిశోధన, ప్రాజెక్టులపై ధ్యాసే లేదు
ఇస్తామన్నా రిసెర్చ్ నిధులపై నిర్లిప్తత
బడుగు పిల్లల చదువులతో చెలగాటం
పైగా గైడెన్స్ ఇస్తున్నామంటూ పోజు
అయినా పట్టించుకోని వీసీలు, ఈసీలు
కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీతోనే మమ
జేఎన్‌టీయూహెచ్‌కి వీసీలుగా పనిచేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి...క్లాసులకు వెళ్లి పాఠాలు చెప్పేవారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ సింహాద్రి తరగతులు జరిగేటప్పుడు విద్యార్థులు, ఫ్యాకల్టీ బయట కనిపిస్తే ఊరుకునేవారుకాదు. బోధనలో, పాలనలో ఒక తరం పాటించిన విలువలివీ! మరి ఇప్పుడో..! సొంత, లాభదాయక వ్యవహారాలకే అంకితమవుతూ, ఇంకా టైమ్ ఉంటే రావడం..బుద్ధిపుడితే బోధించడం! ప్రొఫెసర్లు మొదలు వీసీల దాకా ఒకే దారిలో! రివర్స్‌గేర్‌లోకి మారిన వర్సిటీల బోధన పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
లక్షల్లో జీతాలు! లక్షణమైన జీవనశైలి! కదిలితే, మెదిలితే కారు, ఫోను, ఎన్నెన్నో అలవెన్సులు! విశ్వవిద్యాలయాల్లో సీనియర్ ప్రొఫెసర్లకు ఇన్నిన్ని సౌకర్యాలు ఇస్తున్నా క్లాసులకు రారు. పాఠం చెప్పరు. అందరూ ఇలాగే ఉన్నారా అంటే కాదు. సింహభాగం మాత్రం పరిపాలన పరమైన పదవులు పొంది, వారి ప్రథమ కర్తవ్యంగా భావించాల్సిన బోధన, పరిశోధనలను చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారు. నిజానికి, విశ్వవిద్యాలయాలకు సీనియర్ ఫ్యాకల్టీ అవసరం ఎంతగానో ఉంటుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, సమాజాభివృద్ధికి హితోపకరమైన పరిశోధనలు చేయాల్సింది ప్రొఫెసర్లే. దీనికిగాను వారు నెలకు కనిష్ఠంగా రూ.1.90 లక్షల నుంచి రూ.2.5 లక్షల జీతం అందుకొంటున్నారు. కారు అలవెన్స్ దీనికి అదనం. సాంకేతిక వర్సిటీల్లో అయితే, కారు, డ్రైవరు, ఫోను, చిల్లర ఖర్చుల అలవెన్స్‌లూ ఇస్తున్నారు. అయినా, సీనియర్ ప్రొఫెసర్లలో చాలామంది బోధనకు ఆమడ దూరంలో ఉంటున్నారు. సమయ పాలన వారికి పట్టడం లేదు. సొంత వ్యాపకాలే పరమావధిగా మొక్కుబడిగా వర్సిటీలకు వచ్చి పోతున్నారు.
పొజిషన్ కావాలబ్బా..
విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లు మినహా ఫ్యాకల్టీ యావత్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిందే. కానీ అలా జరగటం లేదు. సీనియర్ ప్రొఫెసర్లలో చాలామంది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అటానమస్ కాలేజీలకు నిజ నిర్ధారణ కమిటీల పేరుతో అవసరానికి మించి ప్రొఫెసర్లను పంపిస్తున్నారు. రెక్టార్లు, కాలేజ్ డెవల్‌పమెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్లు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ (డీఈ), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీవోఈ), సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) డైరెక్టర్, సీడీఈ ఎగ్జామ్స్ కోఆర్డినేటర్, ఓఎ్‌సడీ, పీజీ, యూజీ ఎగ్జామ్స్ కోఆర్డినేటర్, వర్సిటీ హాస్టల్ వార్డెన్, ఐక్యూఎసీ కోఆర్డినేటర్, ఎన్‌ఎ్‌సఎస్ కోఆర్డినేటర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ కోఆర్డినేటర్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, అడ్మిషన్స్ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ల వారీగా ప్రిన్సిపాళ్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో మెంబర్లు, యూజీసీ, ఇతర ఫండింగ్ ఏజన్సీలకు సంబంధించిన అధిపతులు...ఇలాంటి 30 రకాల అడ్మినిస్ర్టేషన్ పొజిషన్ల కోసం పలువురు ప్రొఫెసర్లు వెంపర్లాడుతున్నారు.
రాష్ట్రంలో పెద్ద వర్సిటీ ఆంధ్రా విశ్వవిద్యాలయం. దాదాపు 60 మంది సీనియర్ ఫ్యాకల్టీ అడ్మినిస్ర్టేషన్ పొజిషన్ పదవుల్లోనే ఉన్నట్లు సమాచారం. వీటిల్లో చాలా వరకు వీసీలు తమ మనుషుల కోసం సృష్టించినవేశ్రీ ఈ పదవుల్లో ఉన్న వాళ్లంతా ఫ్యాకల్టీ నుంచివచ్చినవాళ్లే. టీచింగ్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు చేపడితే ఎవరూ అభ్యంతరపెట్టరు. కానీ, రివర్స్ గేర్‌లో పనిచేస్తుండటమే విమర్శలకు గురిచేస్తోంది. వర్సిటీ పాలన చాలా వరకు విద్యార్థుల సమస్యలతో ముడిపడి ఉంటుంది. రెగ్యులర్, సీనియర్ ఫ్యాకల్టీ విద్యార్థులకు బోధన చేస్తున్నారా.. పరిశోధనలపై దృష్టి పెడుతున్నారా..అన్న విషయాలపై వీసీలు ఆరా తీయడం లేదు. చాలా వర్సిటీల్లో 2008 తర్వాత ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ లేదు. అంతకు పూర్వం నియమితులైనవారు పదోన్నతులు పొందటంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు. అసోసియేట్ ప్రొఫెసర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇకపోతే మిగిలిందంతా ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్లు మాత్రమే. వాళ్లు కూడా పాఠాలకు దూరమైతే ఇక వర్సిటీల పరిస్థితి ఏమిటి?
విధులకు వెళ్లరు.. నిధులు తెచ్చుకోరు..
వర్సిటీల పర్యవేక్షణ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల (ఈసీ) విధి. విద్యార్థులకు బోధన సరిగ్గా జరుగుతున్నదా....ఫ్యాకల్టీ క్లాసులకు వెళుతుందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. అయితే, కౌన్సిల్ సభ్యులకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే అంశాలే రుచిస్తాయని చెబుతున్నారు. ఈ పరిస్థితిపై కొద్దిరోజులుగా ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ స్పందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల సమావేశాల్లో దీన్ని ప్రధాన అజెండా తీసుకుంటూ వీసీ, రిజిస్ట్రార్ మినహా ప్రొఫెసర్లు తప్పనిసరిగా విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిందేనని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు వర్సిటీలకు యూజీసీ,ఏఐసీటీఈ, డీఎ్‌సటీ, డీబీటీ వంటి సంస్థల ద్వారా రిసెర్చ్ ప్రాజెక్టులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేస్తుంటుంది. కానీ రాష్ట్ర వర్సిటీలు రిసెర్చ్ ప్రాజెక్టులను మంజూరు చేసుకోవడంతో విఫలమవుతున్నట్లు సమాచారం. వర్సిటీల్లోని సీనియర్ ఫ్యాకల్టీ ప్రత్యేక దృష్టి పెడితే ప్రాజెక్టులు, నిధులు వస్తాయి. కానీ ఆ వాతావరణం లేదు. విద్యార్థులకు బోధన చేయకుండా ఇతర వ్యాపకాలతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే .. విద్యార్థులకు గైడెన్స్ ఇస్తున్నామన్న సమాధానం వస్తోంది.
చిక్కుల్లో పోస్టులు..
గత ప్రభుత్వం వర్సిటీల్లోని 1385 ఖాళీ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని భావించి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం ఏపీపీఎస్సీ ద్వారా స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించింది. కానీ న్యాయపరమైన వివాదాల కారణంగా ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారమయ్యేవరకు ఆ వ్యవహారం ఇక అంతే. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, టీచింగ్ అసిస్టెంట్లు, పార్ట్ టైమ్ తదితర తాత్కాలిక ఫ్యాకల్టీ మాత్రమే రెగ్యులర్‌గా క్లాసులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు సమాచారం.
Updated Date - 2021-02-23T08:01:06+05:30 IST