ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు: బాలకృష్ణ
ABN, First Publish Date - 2021-03-04T16:44:36+05:30
బాలకృష్ణ గురువారం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లామన్నారు. ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, జవాబు దారి తనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు.
మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామని, ఇప్పుడు ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. హిందూపురంలో ఎవ్వరు భయపడొద్దని, రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి... మరొకరు లిక్కర్ మాఫియా అని అన్నారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు గత ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వారనీ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి మారిపోయిందని బాలయ్య వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-03-04T16:44:36+05:30 IST