బీసీ జనగణన!
ABN, First Publish Date - 2021-10-29T08:07:27+05:30
వెనుకబడిన వర్గాల జనాభాను లెక్కించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.
కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం.. కేబినెట్ నిర్ణయం
75 శాతం హాజరుంటేనే అమ్మ ఒడి సొమ్ము!
కొత్తగా ఈడబ్ల్యూఎస్ శాఖ ఏర్పాటు
జైనులు, సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు
ఆన్‌లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ఆర్డినెన్స్
వైద్య ఆరోగ్య శాఖలో 4,035 పోస్టుల భర్తీ
అదానీకి 130 ఎకరాలు, శారదా పీఠానికి 15
విశాఖలో భూ కేటాయింపులు
పద్మవెలమలు, ఆదివెలమలకూ కార్పొరేషన్లు
వచ్చే కేబినెట్‌లో ప్రతిపాదనలు
వాడరేవులో ఫిషింగ్ హార్బర్ పనులు
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో ఒప్పందం
యూనిట్ రూ.2.49కు పాతికేళ్లు కొనుగోలు
గురజాడ వర్సిటీగా విజయనగరం జేఎన్‌టీయూ
ప్రకాశంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం
మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాల జనాభాను లెక్కించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై గురువారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. 2021 జనాభా లెక్కల ప్రక్రియలో బీసీ కుల గణన చేర్చాలనే తీర్మానాన్ని బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం... రాష్ట్రంలో ‘అమ్మఒడి’ పథకాన్ని 2022 జూన్‌లో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 132 రోజులకుగాను 75ు హాజరు ఉంటేనే ఈ పథకానికి అర్హులని స్పష్టంచేసింది. అలాగే వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో కొత్తగా 4,035 పోస్టులను మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 26,917 కొత్త పోస్టులను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2019 నుంచి ఇప్పటి వరకు 14,391 పర్మినెంట్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు వివిధ కేటగిరిల్లో 1,285 పోస్టులు, పట్టణాల్లోని 560 వైఎస్సాఆర్ మున్సిపల్ అర్బన్ క్లినిక్స్‌ల్లో గ్రేడ్-2 ఫార్మసిస్టు పోస్టులు 560 కొత్తగా మంజూరు చేసి, త్వరలో నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైద్యవిద్యవిభాగంలో టీచింగ్, నర్సింగ్, పారా మెడికల్ విభాగాల్లో 2,190 పోస్టులను కొత్తగా మంజూరుకు కూడా తీర్మానించినట్లు తెలిపారు.
ఇవీ మంత్రివర్గ నిర్ణయాలు..
బీసీ కుల గణనను 2021 జనాభా లెక్కల ప్రక్రియలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే బాధ్యత బీసీ సం క్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణకు అప్పగింత.
రేషన్‌కార్డు, ఇంటిస్థలం వంటి పథకాలు సాంకేతికత సమస్యల కారణంగా ఆగితే.. అర్హత ఉన్న వారు జూన్, డిసెంబరు నెలల్లోదరఖాస్తు చేసుకుంటే, పరిశీలించి మంజూరు చేయాలని నిర్ణయం.
సినిమా టికెట్లను ఆన్‌లైన్ విధానంలో విక్రయించేలా 1965 సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ. ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయాలు.
అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్ అనే కొత్త శాఖ ఏర్పాటు.
రాష్ట్రంలోని 27 వేల మంది జైనులు, 10 వేల మంది సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు.
వెలమల్లో పద్మవెలమ, ఆదివెలమలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను వచ్చే కేబినెట్ సమావేశం ముందు పెట్టాలని అధికారులకు ఆదేశం.
సాహిత్యం, కళలు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, పాత్రికేయ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం, వైఎస్సార్ సాఫల్య పురస్కాలను నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అందించాలని నిర్ణయం.
పాల నాణ్యత, పాల సేకరణకు వినియోగించే పరికరాల తనిఖీ బాధ్యతలు తూనికలు, కొలతల శాఖ నుంచి తొలగించి.. పశుసంవర్ధక శాఖకు అప్పగింత.
మావోయిస్టులతో పాటు నిషేధిత సంస్థలపై నిషేఽధం మరో ఏడాది కొనసాగింపు.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పా టు. అందులో 19 పోస్టుల భర్తీ.
రైతులకు 9గంటల ఉచిత విద్యుత్ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో ఒప్పందం. యూనిట్ రూ.2.49 చొప్పున ఏటా 7 వేల మెగావాట్ల చొప్పున పాతికేళ్లపాటు సౌర విద్యుత్ కొనుగోలు.
గాలేరు-నగరి, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాల ద్వారా కడప జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపాలని నిర్ణయం.
కొత్తగా మూడు ఆక్వాకల్చర్ ప్రాజెక్టులు.. 73 పోస్టుల భర్తీ.
విజయనగరంలో జేఎన్‌టీయూ కాలేజీని యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం. దీనికి గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంగా పేరు మార్చుతూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి కూడా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయం.
ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రూ.2,205 కోట్లతో 8 వేల కి.మీ. రోడ్ల నిర్వహణకు 1,176 పనుల ప్రతిపాదన. ఇప్పటికి 40ు పనులకు టెండర్లు పూర్తి. రాయలసీమలో పనులు ప్రారంభం. కోస్తాలో 60ు పనులకు నవంబరు 15న టెం డర్లు. ఆ నెలాఖరులో కాంట్రాక్టు సంస్థల ఖరారు. డిసెంబరు నుంచి వచ్చే మేనెలలోపు పనులు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం.
శాసనమండలిలో కొత్త విప్‌లు గోపాల్‌రెడ్డి, జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటుకు ఆమోదం.
వాసవీ కన్యకాపరమేశ్వరీ సత్రాలు, అన్నదాత సత్రాల నిర్వహణ ఆర్యవైశ్యులకే అప్పగింత.
విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టు, విశాఖలో తాజ్ వరుణ్‌బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టు, విజయవాడలో హోటల్ హయత్‌కు పర్యాటక పాలసీలో పలు రాయితీల వర్తింపు.
తిరుపతిలో రూ.250 కోట్లతో, భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం.
ప్రకాశం జిల్లా వాడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు ఆమోదం.
భూముల కేటాయింపు..
విశాఖ మధురవాడలో అదానీ ఆధ్వర్యంలో 2వేల మెగావాట్ల డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ వర్సిటీల ఏర్పాటుకు 130 ఎకరాలు కేటాయింపు.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో వేద విద్యాలయం, సంస్కృత పాఠశాల కోసం శారదాపీఠానికి 15 ఎకరాలు కేటాయింపు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్ముపర్తిలో వేద, సంస్కృత పాఠశాలల కోసం జయలక్ష్మి-నరసింహశాస్త్రి ట్రస్టుకు 17.49 ఎకరాలు.
అనంతపురం జిల్లా పెనుగొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలోని ఆధ్యాత్మిక కేం ద్రాని కి లీజు పద్ధతిలో 75 ఎకరాల కేటాయింపు.
చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆస్పత్రికి అవసరమైన భూమి మార్పిడి.
కర్నూలు జిల్లా దిన్నదేవరపాడులో సిల్వర్ జూబ్లీ పాఠశాలకు 50 ఎకరాల భూమి మార్పిడి.
నూజివీడులో కేంద్రీయ విద్యాలయం కోసం 7 ఎకరాలు విద్యాశాఖకు బదిలీ.
పేరూరు, అన్నవరం, గండికోట, హార్స్‌లీహిల్స్, పిచ్చులలంకలోని పర్యాటక స్థలాల్లో 7 స్టార్ లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి స్థలాల కేటాయింపు.
జీఎస్‌టీ సవరణలకు కేబినెట్ ఆమోదం
ఏపీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎ్‌సటీ) చట్టానికి చేసిన సవరణలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2017లో ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ నాలుగేళ్లలో ఈ చట్టం అమల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా జీఎ్‌సటీ కౌన్సిల్ ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు సెక్షన్లు సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. దీని ప్రకారం పార్లమెంటులో కేంద్రం సవరణ చట్టాన్ని ఆమోదించింది. సెక్షన్ 50లో సవరణ ప్రకారం స్థూలపన్నుపై కాకుండా నికర పన్నుపై వడ్డీ లెక్కించడం ద్వారా ఆలస్యమైన పన్ను చెల్లింపులపై చెల్లింపుదారులకు వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. సెక్షన్ 74 సవరణ ద్వారా పన్ను ఎగవేత , వస్తువుల రవాణాకు సంబంధించిన నేరాలకు వేర్వేరుగా జరిమానాలు విధిస్తారు. పన్ను చెల్లింపుదారు తాను స్వయంగా ధ్రువీకరించిన పన్నును చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ వ్యక్తి నుంచి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ సెక్షన్ 75ని సవరించారు. ఇవి కాకుండా 35, 44, 16 సెక్షన్లను కూడా సవరించారు.
Updated Date - 2021-10-29T08:07:27+05:30 IST