గంజాయి సాగు ఈనాటిది కాదు!
ABN, First Publish Date - 2021-10-29T08:13:36+05:30
గంజాయి సాగు ఈనాటిది కాదు!
తరతరాలుగా సాగుతోంది.. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు
అన్నిటికీ దేవుడే ఉన్నాడు.. సరైన బుద్ధి చెబుతాడు.. అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం
గంజాయిపై త్వరలో విశాఖలో డీజీపీల సమావేశం.. కేబినెట్ భేటీలో సీఎం జగన్
స్థానిక సంస్థల్లో ఖాళీలకు నోటిఫికేషన్.. అభ్యర్థుల విజయానికి మంత్రులంతా కృషి చేయాలి
1 నాటికి షెడ్యూల్ ఇచ్చేస్తే 16 లేదా 17 నుంచి అసెంబ్లీ.. ముఖ్యమంత్రి అంగీకారం
చర్చకు రాని టీటీడీ ఆర్డినెన్స్.. న్యాయస్థానంలో కేసు ఉన్నందునే?
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి సాగు తరతరాలుగా వస్తోందని.. అది ఈ నాటిది కాదని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. ప్రభుత్వంపైనా, నాపైనా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వాటన్నింటికీ దేవుడే ఉన్నాడు. సరైన బుద్ధి చెబుతాడు’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ భేటీలో అధికారిక ఎజెండా అంశాలపై మధ్యాహ్నం 12.30 గంటలకు చర్చ ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటల వరకూ రాజకీయ చర్చ జరిగింది. గంజాయి సాగు విధ్వంసంపై కఠినంగా వ్యహరిస్తున్నామని.. స్మగ్లింగ్ ముఠాను పట్టుకుంటున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ కేబినెట్‌కు నివేదించారు. పోలీసు చర్యల వల్ల గంజాయి నిర్మూలనలో రాష్ట్రం దేశంలో 18వ స్థానం నుంచి రాష్ట్రం 16వ స్థానానికి వచ్చిందన్నారు. ఇటీవల ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని.. గంజాయిపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని.. దానిని దీటుగా సమాధానం చెబుతామని అన్నారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఏవోబీలో గంజాయి మొక్కల పెంపకం తరతరాలుగా వస్తోందని.. ఈ రెండున్నరేళ్ల నుంచే మొదలు కాలేదని అన్నారు. గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకుంటున్నామని.. డీజీపీ సవాంగ్ త్వరలోనే విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగించే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స జోక్యం చేసుకుని.. టీడీపీని కూడా నిషేధించేస్తే పోతుందని వ్యాఖ్యానించడంతో మంత్రులు ఒక్కసారిగా నవ్వారు.
‘స్థానిక’ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. న్యాయస్థానం తీర్పు ఇస్తే.. 30 మున్సిపాలిటీలకు జరపాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. వీటితోపాటు ఖాళీగా ఉన్న జడ్పీటీసీ , ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని పంచాయతీరాజ్, పురపాలక మంత్రులను ఆదేశించారు. నవంబరు 1న నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో అంటే.. నవంబరు 15 నాటికి పూర్తవుతుందని తెలిపారు. వెంటనే నవంబరు 16 లేదా 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నెల్లూరులో కొత్త పింఛన్ల జారీకి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని మంత్రి అనిల్ కుమార్ కోరారు. అయితే ఏటా డిసెంబర్లో, మళ్లీ జూన్‌లో కొత్త పింఛన్లు, బియ్యం కార్డులను జారీ చేయాలని నిర్ణయించామని సీఎం గుర్తుచేశారు. అర్హుల జాబితాను ఓటర్లకు చూపిస్తూ డిసెంబరులో కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించాల్సిందిగా అనిల్‌కు సూచించారు. స్థానిక ఎన్నిల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులూ కృషి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. వచ్చే నెల 16న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిద్దామనుకుంటున్నందున.. నేరుగా అసెంబ్లీలో బిల్లు పెడదామని అధికారులకు సీఎం సూచించారు. అయితే తక్షణమే ఆర్డినెన్సు జారీ చేద్దామని వారు చెప్పడంతో ఆయన సరేనన్నారు.
అవంతితో ప్రత్యేకంగా సమీక్షించండి..
కేబినెట్ సమావేశం ముందుగానే ముగిశాక.. ఇంకేమిటి సంగతులని మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖకు భారీ పెట్టుబడులు తెచ్చారని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. అవంతి జోక్యం చేసుకుని.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖ ఆకర్షణీయంగా ఉందని వివరించే ప్రయత్నం చేశారు. అసలే సీఎంను కలసి మాట్లాడేందుకు సమయం తక్కువగా ఉంటోందని భావిస్తున్న కొందరు మంత్రులు.. ‘సార్.. అవంతితో మీరు ప్రత్యేకంగా సమీక్షించండి’ అని సీఎంతో అన్నారు. ఇంకొందరు మంత్రులు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రిని అవంతి సమీక్షిస్తారంటూ సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఎందుకు రాలేదబ్బా..!
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను చేర్చి ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదన గురువారం కేబినెట్ ముందుకు రాకపోవడం విస్మయపరచింది. ఈ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదానికి పెట్టాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. కేబినెట్ ఎజెండాలోనూ చేర్చారు. అనూహ్యంగా ప్రస్తావనకు రాలేదు. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం చట్టవిరుద్ధమని హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఈ సమయంలో ఆర్డినెన్స్ తేవడం సరికాదనే కేబినెట్ ముందుకు తీసుకురాలేదని తెలిసింది.
Updated Date - 2021-10-29T08:13:36+05:30 IST