ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్‌తో ఏమన్నా చావే!

ABN, First Publish Date - 2021-08-22T09:22:37+05:30

ఆయన పలకరింపులో ఆప్యాయత కనిపిస్తుంది. ఆయన మాటలో స్పష్టత ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయనలోనే మరో కోణం ఉందని, దానిని తట్టుకోవడం కష్టమని ఆ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్యాక్స్‌ కట్టని బస్‌ ఆపరేటర్‌.. తాఖీదు పంపిన డీటీసీకి శిక్ష

ముందే భోజనానికి గన్‌మెన్లు

మంత్రి తిన్నాక రండన్న ఎంవీఐ

అనంతకు ఆ అధికారి బదిలీ

బీసీ, ఎస్సీ సిబ్బందిపై కస్సుబుస్సు

‘నచ్చిన’ వర్గమైతే ఏదైనా చల్తా

ఆ వర్గం అధికారికి పని చెప్పారని సిక్కోలుకు బీసీ అధికారి బదిలీ

మెచ్చితే కేసులున్నా అక్కడే పోస్టు


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

ఆయన పలకరింపులో ఆప్యాయత కనిపిస్తుంది. ఆయన మాటలో స్పష్టత ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయనలోనే మరో కోణం ఉందని, దానిని తట్టుకోవడం కష్టమని ఆ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాలకు సైతం వేధిస్తున్నారని, పీఏ వెంటనే ఫోన్‌ ఎత్తకపోయినా..గన్‌మెన్లను తర్వాత భోజనం చేయండని చెప్పినా ఆయన తట్టుకోలేక పోతున్నారని నిట్టూరుస్తున్నారు. పిలిచి చీవాట్లు పెట్టడం, లేదా బదిలీ చేయడం తమ శాఖలో సర్వసాధారణం అయ్యాయని వాపోతున్నారు. అది కూడా ఎస్‌సీ, బీసీలను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని, రెడ్లు తప్పు చేసినా ఏమీ అనరని, పైగా వారికి ఎవరైనా పని చెబితే మూడినట్లేనని అంటున్నారు. కర్నూలు అధికారి శ్రీకాకుళం... తూర్పు గోదావరి అధికారి అనంతపురం బదిలీ అవుతారని ఆధారాలు చూపిస్తున్నారు. ఏదైనా శాఖాపరమైన తప్పు చేస్తే తమపై చర్యలు తీసుకున్నా పట్టించుకోబోమని, చిన్న విషయాలకూ ఇబ్బంది పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పోనీ తప్పు చేసిన వారికి ఏమైనా పనిష్మెంట్‌ ఇస్తున్నారా.? అంటే అవినీతికి పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న అధికారికి కేసు నమోదైన చోటే పోస్టింగ్‌ కోసం ఒత్తిడి తెచ్చి ఇప్పించుకున్నారని రెండో కోణం చూపిస్తున్నారు. మంత్రి గారి బాధిత దళిత సిబ్బంది... ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఉప ముఖ్యమంత్రితో చెప్పించినా అమాత్యుడు కరుణించలేదు. దీంతో రాష్ట్ర రవాణాశాఖలో పనిచేస్తున్న ఎస్సీ, బీసీ అధికారులు బిక్కుబిక్కు మంటున్నారు. 


విశాఖపట్నంలో ఒక బస్‌ ఆపరేటర్‌ను రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిందిగా అధికారులు అడిగారు. డీటీసీని కలిసి ఏదో ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే, ఆయన లొంగలేదు. మొత్తం చెల్లించాల్సిందేనని తెగేసిచెప్పడంతో బస్‌ ఆపరేటర్‌.. మంత్రిని కలిశారు. వెంటనే డీటీసీకి ఫోన్‌ వెళ్లింది! ఆ తర్వాత అధికారి నుంచి ఆపరేటర్‌కు ఫోన్‌ వెళ్లింది. ‘‘మంత్రిగారిని కలిశారట కదా? మీ సమస్య ఏమిటో చెప్పండి?’’ అని డీటీసీ అడిగారు. అయితే, ట్యాక్స్‌ విషయంలో తాను ఏమీ చేయలేనని అధికారి తేల్చేశారు. ఇందుకుగాను ఆయనను విజయవాడ హెడ్‌ క్వార్టర్స్‌కు పిలిపించి నెలరోజుల పాటు ఇబ్బంది పెట్టారు. డీటీసీ స్థాయి అధికారిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని కొందరు ఉన్నతాధికారులు చెప్పడంతో... హెచ్చరించి పంపించారు. ఆ తర్వాత నుంచి సదరు అధికారి మునుపటంత గట్టిగా పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు.


డ్యూటీ చేయమన్నందుకు...

తూర్పుగోదావరి జిల్లాలో పని చేస్తున్న ఒక ఎంవీఐని కర్నూలు జిల్లాకు పంపాలని ‘తాడేపల్లి’ నుంచి సిఫారసు వచ్చింది. బదిలీలు లేకపోవడంతో ఆన్‌ డ్యూటీ(ఓడీ) కింద నంద్యాలకు పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన శ్రీశైలం చెక్‌పోస్టులో నంద్యాలలోని ముగ్గురు ఎంవీఐలు ఒక్కొక్కరు పది రోజుల చొప్పున డ్యూటీ చేయాలి. భారీ సిఫారసుతో వచ్చిన ‘నచ్చిన సామాజికవర్గా’నికి చెందిన సదరు అధికారి గురించి తెలియక... ఆయనను రెగ్యులర్‌ డ్యూటీ చేయాలని ఓ బీసీ అధికారి కోరారు. అంతే.. విషయం అమాత్యుడికి చేరి రచ్చ రచ్చ అయింది. ఇది పెద్ద తప్పు కాదని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సరిహద్దు చెక్‌ పోస్టులకు సిబ్బంది శాంక్షన్‌ లేనందున రాష్ట్రమంతా ఇలాగే చేస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఆ బీసీ అధికారిని శ్రీకాకుళం జిల్లాకు విసిరేశారు. 


గౌరవానికి పోతే..

రవాణాశాఖలో ఏడాదికాలంగా పదవీ విరమణ చేసిన వారికి కరోనాప్రభావంతో గౌరవంగా వీడ్కోలు పలకలేదని కమిషనర్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు భావించారు. వారిని పిలిపించి భోజనం పెట్టి, మంత్రితో శాలువ కప్పిస్తే సంతోషిస్తారని అనుకున్నారు. గత నెలలో విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమం జరుగుతుండగా మంత్రికి ఏర్పాటుచేసిన చోట భోజనం చేసేందుకు గన్‌ మెన్లు వచ్చారు. ‘ఇది మంత్రి గారి కోసం ఏర్పాటు చేశాం.. మీకు పక్కన ఉంది’ అని భోజన బాధ్యతలు చూస్తున్న ఎంవీఐ చెప్పారు. అయితే, తాము ఇక్కడే తింటామని వారు చెప్పారు. ‘‘మంత్రి కన్నా ముందు మీరు తినడం ఆయనకు తగిన గౌరవం కాదు’’ అని ఎంవీఐ బదులిచ్చారు. ఆ తర్వాత ఎవరికి వారు భోజనాలు చేసి వెళ్లిపోయారు. కారెక్కిన తర్వాత ‘భోజనం చేశారా?’ అని మంత్రి తన గన్‌ మెన్లు, పీఏని అడిగారు. తమను అక్కడ ఎంవీఐ అవమానించారని వారు ఫిర్యాదు చేశారు. ఎంవీఐని అప్పటికప్పుడే పిలిపించి మంత్రి చీవాట్లు పెట్టి అనంతపురం బదిలీ చేయించారు. ఆ ఎంవీఐది ఎస్సీ సామాజికవర్గం. ‘‘నేను మంత్రిగారి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే, నాకు పనిష్మెంట్‌ ఏంటని’’ ఎస్‌సీ ఎమ్మెల్యేలకు చెప్పుకొని బాధపడ్డారు. ఆ అధికారి తరఫున ఆ ఎమ్మెల్యేలతోపాటు ఒక డిప్యూటీ సీఎం ఫోన్‌ చేసినా మంత్రి శాంతించలేదు. చేసేది లేక ఆ అధికారి అనంతపురం వెళ్లి విధుల్లో చేరారు. 


అవినీతి అధికారికి అందలం..

ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేస్తే సస్పెండ్‌ చేసి విచారణ తర్వాత ఎక్కడో ఒకచోట లూప్‌లైన్‌ పోస్టింగ్‌ ఇవ్వడం ఆయా శాఖల్లో జరుగుతూ ఉంటుంది. రవాణాశాఖలో ‘లోడు లారీ’తో పోల్చే ఓ అధికారిపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అభియోగ పత్రంలో 300శాతం అధిక ఆస్తులు కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఆ అధికారి మంత్రిని కలిశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే కేసు నమోదైన చోటే మళ్లీ ఆయనను నియమించారు. ఈ వ్యవహారం సిబ్బంది ముక్కున వేలేసుకునేలా చేసింది. అంతేకాదు ప్రకాశం జిల్లాలో ఏసీబీ కేసున్న  అధికారికి పదోన్నతి కూడా కల్పించారు. 


‘షిర్డీ’కి ముడుపు కట్టు.. కోరిన ఓడీ పట్టు..

అమాత్యుడి కన్నా ముందు ఆయన సహాయకుడి ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా అయిపోతుందనే రవాణా శాఖలో చెబుతుంటారు. ప్రభుత్వంలో బదిలీలపై నిషేఽ దం ఉన్నా ఆయనను మెప్పిస్తే, ఓడీలు తెచ్చుకుని కోరుకున్న చోటుకు వెళ్లిపోవచ్చు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంవీఐలు, ఏఎంవీఐలు తమకు కావాల్సిన పోస్టింగ్‌ కోసం ‘షిర్డీ’ కృప చాలంటున్నారు. మంత్రిని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత సార్‌ కు చెప్పి ఒప్పిస్తా అనే అసిస్టెంట్‌ ఒకరు ఓడీలు వేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ముడుపులు ఇచ్చుకుని పలువురు పోస్టింగ్‌ తెచ్చుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో రాష్ట్రంలో ఏకంగా పదిమంది వరకూ ఓడీలు తెచ్చుకుని కోరుకున్న చోట డ్యూటీలు చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2021-08-22T09:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising