వకీల్‌సాబ్‌పై జగన్ సర్కారు కక్ష!
ABN, First Publish Date - 2021-04-09T09:09:50+05:30
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రంపై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి...
- ప్రీమియర్ షోలకు నిరాకరణ
- టికెట్ చార్జీలూ పెంచే వీల్లేదు
- అధిక ధర వసూలు చేస్తే చర్యలు
- అధికారుల హెచ్చరిక
- పవన్ అభిమానుల ఆగ్రహం
- విజయవాడ గాంధీనగర్‌లో గలాటా
విజయవాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రంపై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది. కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. శుక్రవారం వకీల్‌సాబ్ చిత్రం విడుదలకు మొత్తం రంగం సిద్ధమైంది. అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడా అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల విడుదలైన నితిన్ చిత్రం ‘రంగ్ దే’కు టికెట్ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని నిలదీశారు. ఇంకోవైపు.. జాయింట్ కలెక్టర్ ప్రకటనతో ఎగ్జిబిటర్లు కూడా డైలమాలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు గిట్టుబాటు ఉండదని నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారు. గాంధీనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన గలాటా నేపథ్యంలో థియేటర్ల వద్ద పరిస్థితులు ఏ క్షణాన ఎలా మారతాయోనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
4 వారాలు ఓటీటీకి వద్దు
కొత్తగా విడుదలైన అగ్రహీరోల చిత్రాలను నాలుగు వారాల వరకు ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. ఇవ్వడం వల్ల చిత్రాలను అత్యధిక ధరలకు కొనుగోలు చేసిన పంపిణీదారులు బాగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు సమావేశమయ్యారు. టికెట్ల ధరల పెంపుదలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేనందున దీనిపై సమావేశంలో చర్చించలేదు.
Updated Date - 2021-04-09T09:09:50+05:30 IST