కేంద్రం చెవిలో పూలు!
ABN, First Publish Date - 2021-08-30T07:46:52+05:30
కేంద్రం చెవిలో పూలు!
రాష్ట్ర అక్రమ అప్పులకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఎక్కడా అప్పు పుట్టకుండా గట్టిగా చర్యలు తీసుకుంది. అయినా.. రూ. 20 వేల కోట్లు అప్పు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. విచిత్రంగా, తనకు చెక్ పెట్టిన కేంద్రం చెవిలోనే ఇందుకోసం పూలు పెట్టేందుకు తెగబడుతోంది. అది ఎలాగంటే...
పరాకాష్ఠకు చేరిన ఆర్థిక అరాచకం
కేంద్ర పథకాలకు బ్యాంకు ఖాతాల్లో హైడ్రామా
20,000 కోట్లకు ప్రభుత్వం టెండర్.. ఇంకో 4 నెలలు గడపొచ్చనే ఆలోచన
‘తప్పు’ను కొనసాగించేందుకే నోడల్ ఏజెన్సీలుగా కార్పొరేషన్లు
పేరుకు కేంద్ర పథకాలకు.. మళ్లించేది రాష్ట్ర పథకాలకు
కార్పొరేషన్ల పేరుతో కేంద్రాన్ని ఎన్నిసార్లు బురిడీ కొట్టిస్తారో..
రాష్ట్రం వాటా కింద ఓడీ ఇవ్వాలని బ్యాంకులకు గేలం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పథకాల అమలు బాధ్యత శాఖాధిపతుల కార్యాలయాలది (హెచ్‌వోడీలు). అయితే, వాటిని పక్కకు నెట్టేసి కంపెనీల చట్టం ప్రకారం వ్యాపార కార్యకలాపాల కోసం ఏర్పాటైన కార్పొరేషన్ల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచే హైడ్రామాకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ఆ కార్పొరేషన్లు ప్రభుత్వం కాలేవు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చే వివిధ పథకాల నిధులను ఈ కార్పొరేషన్ల పేరిట తెరిచే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసి అక్కడ నుంచి తన పథకాలు అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ. పథకాల అమలు కోసం హెచ్‌వోడీలు ఉండగా, కార్పొరేషన్లను తెరపైకి తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి ఇప్పటికే 29 కార్పొరేషన్ల పేరుతో రాష్ట్రం అక్రమంగా రూ.1,23,000కోట్ల అప్పులు తెచ్చి వాడేసింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ అక్రమ వ్యవహారాలపై హైకోర్టులో కేసుల మీద కేసులు పడుతున్నాయి. అలాంటిది కేంద్ర పథకాల నిర్వహణకు కూడా రాష్ట్రప్రభుత్వం కార్పొరేషన్లనే ఎంచుకోవడంతో ఉన్న మతలబు ఏమిటని ఆర్థిక శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఎటెళ్తాయో ఎవరికి తెలుసు..
కార్పొరేషన్ల పేరిట తెరిచే బ్యాంకు ఖాతాల నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల డబ్బు కేంద్ర పథకాలకే వెళ్తుందా.... రాష్ట్ర పథకాలకు వెళ్తుందా... లేదా ఆత్మీయుల బిల్లుల చెల్లింపు కోసం వాడుతారా... అనేది కేంద్రం ఎలా తెలుసుకోవాలి? తామిచ్చిన డబ్బు, రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ అ య్యాయా లేదా? అ క్కడ నుంచి థర్డ్‌పార్టీకి (లబ్ధిదారులు కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చు) చెల్లింపులు జరిగాయా లేదా అనేది మాత్రమే కేంద్రం చూడగలదు. ఆ థర్డ్‌పార్టీ ఎవరు అనేది కేంద్రానికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఒక్కో పథకానికి లబ్ధిదారులు లక్షల్లో ఉంటారు. వాళ్లందరూ ఆ పథకం లబ్ధిదారులా? రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అనేది ఎలా తెలుస్తుంది? ఎక్కడా అప్పు పుట్టక డబ్బుల కోసం కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్నే ఇప్పుడు ఆసరా చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం కేంద్రం డబ్బులు వాడుకొనే ఆలోచనలో ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అనుమానిస్తున్నారు.
కేంద్రం ఒప్పుకొంటేనే..
ఆర్‌బీఐ, బ్యాంకర్లతో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కార్పొరేషన్ల పేరిట రాష్ట్రాలకు ఇష్టారాజ్యంగా అప్పులివ్వకూడదంటూ బ్యాంకర్లను హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్రం బ్యాంకులను అప్పు అడిగినప్పుడు కూడా కేంద్రం అనుమతి ఉంటేనే ఇ స్తామని బ్యాంకులు రాష్ట్రానికి చెప్పాయి. దీంతో అప్పు కాదు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తమ వాటాను ఓడీ రూపంలో ఇవ్వండంటూ బ్యాంకులను కోరుతున్నాయి. ఓడీ అయినా అప్పే. చెల్లించే సమయాన్ని బట్టి 8 నుంచి 10 శాతం వడ్డీ అమలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ఓడీ చెల్లింపులకు ఏడాది కాలపరిమితి ఉంటుంది. దీన్ని అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదా ...ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కింద రాష్ట్రానికి అప్పుల పరిమితి ముగిసిపోయిందన్న విషయం తెలివిగా మభ్యపెడుతున్నారా అంటూ ఆర్థిక నిపుణులు విస్మయానికి గురవుతున్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు రూ.5,000 కోట్లా ?
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చింది రూ.226 కోట్లే. కానీ, ఈ ఏడాది రూ.5,000 కోట్లు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. కేంద్రం వాటా ఉన్నట్టుండి రూ.226 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు ఎ లా పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే అతి తెలివి చూపించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు అధికంగావచ్చే గ్రామీణాభివృద్ధి శాఖలోని పథకాలను ఈ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ అ మలు చేస్తున్నట్టుగా బ్యాంకులకు ఇచ్చిన సమాచారంలో చూపించారు. ఉపాధిహామీ అన్ని పథకాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహిస్తే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏం చేస్తారు?అలాగే, ఎన్‌హెచ్‌ఎం కింద వచ్చే పథకాలను వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహిస్తారు. ఇప్పుడు వాటిని మెడికల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌కి బదిలీ చేస్తే వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ఏం చేస్తారు ?
రూ.20,000 కోట్లకు టెండర్
జూన్, జూలై, ఆ గస్టు నెలల్లో కేంద్రం వాటా నిధులు రాష్ట్రానికి రాలేదు. కేంద్ర పథకాల నిధులు రాష్ట్రం దుర్వినియోగం చేస్తోంది కాబట్టి ఒ క్కో కేంద్ర ప్రాయోజిత పథకానికి బ్యాంకు ఖాతాలు తెరవమని కేంద్రం ఆదేశించింది. కేంద్రం వాటా నిధులు, రాష్ట్రం వాటా నిధులు ఆ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాక వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనేది కేంద్రం ఆలోచన. ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లాగిన్ వివరాలు తమకూ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. అంటే కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు జమ అవుతున్నాయా ? లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనేది సరిచూసుకోవచ్చనేది కేంద్రం ఆలోచన. ఇలా చేయమని గత ఏడాది రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించింది. అయినా, రాష్ట్రం చేయకపోవడంతో మూడు నెలలుగా తన వాటా డబ్బులు నిలిపివేసింది. సెప్టెంబరు నెలాఖరులోగా చేయాలనే డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వాటా నిధులు రూ.12,000 కోట్లు వస్తాయి. రాష్ట్రం వాటా కింద ఇవ్వాల్సిన రూ.7,500 కోట్లను ఓడీ రూపంలో ఇవ్వండని బ్యాంకులను రాష్ట్రం అడుగుతోంది. ఈ ప్లాన్ అనుకున్నట్టుగా జరిగితే రాష్ట్రానికి రూ.20,000 కోట్లు చేతిలోకి వస్తాయి. దీంతో ఇంకో 4 నెలలు గడపొచ్చని రాష్ట్రం భావిస్తోంది. అందులో ఓడీ రూపంలో వచ్చే రూ.7,500 కోట్లు అప్పే. ఈ ఓడీ పరిమితి ఏడాది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకే వస్తుంది. కానీ, రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ముగిసిపోయింది. ఉన్న రూ.1,000 కోట్లను మంగళవారం తీసుకొస్తున్నారు. కేంద్రం కొత్తగా అప్పులకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి, ఈ ఓడీ అప్పును ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కింద చూపించరా... కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి మళ్లీ కేంద్రం కళ్లకు గంతలు కడతారా?
Updated Date - 2021-08-30T07:46:52+05:30 IST