జగన్ సిద్ధాంతం.. ఉత్తదేనా..?
ABN, First Publish Date - 2021-03-17T05:46:50+05:30
ఇతర పార్టీల నుంచి పోటీ చేసి..
మెజార్టీ లేకపోయినా కుర్చీ కోసం వైసీపీ వెంపర్లాట
బెదిరింపులు, దౌర్జన్యాలతో చేజిక్కించుకునే యత్నాలు
అధికార పార్టీ రాజకీయాలతో విస్తుపోతున్న ప్రజలు
పట్టు సడలకుండా జేసీపీఆర్ వ్యూహం
రసవత్తరంగా మారిన తాడిపత్రి మున్సిపల్ రాజకీయం
అనంతపురం(ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారు వైసీపీలోకి రావాలంటే.. తన పదవికి రాజీనామా చేసి రావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయ సిద్ధాంతం. అలా కాకుండా పార్టీలోకి ఏస్థాయి లీడర్ వచ్చినా.. చేర్చుకునే ప్రసక్తే లేదని ఆయన పదేపదే చెప్పిన మాటలు అందరికీ ఎరుకే. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ మాటలను ఇక్కడ ఉటంకించాల్సి వస్తోంది. తాజాగా.. జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా.. అందులో రెండు అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. అందులో ఒక వార్డు నుంచి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడున్నారు. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మూడ్రోజుల క్రితం వెల్లడైన ఫలితాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు 14 వార్డుల్లో విజయం సాధించారు. వారికి రెండు ఏకగ్రీవమైన నేపథ్యంలో.. మొత్తం ఆ పార్టీ కైవసం చేసుకున్న వార్డుల సంఖ్య 16కు చేరింది.
ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండు ఓట్లు కలుపుకుంటే వారి సంఖ్య తాడిపత్రి మున్సిపాలిటీలో 18కు చేరింది. ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 19 ఉండాలి. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీకి మెజార్టీ లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విషయానికొస్తే.. ఆ పార్టీ అభ్యర్థులు 18 వార్డుల్లో గెలుపొందారు. మిగిలిన రెండు వార్డుల్లో టీడీపీ మిత్రపక్షంగా ఎన్నికల బరిలో దిగిన సీపీఐ ఒక దానిని గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు. ఆ స్వతంత్ర అభ్యర్థి టీడీపీ మద్దతుదారుడు కావటంతో తాడిపత్రి మున్సిపాలిటీలో వారి సంఖ్య 20కు చేరుకుంది. ఈ లెక్కన టీడీపీ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటినట్లేనన్నది తేటతెల్లమవుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ రకంగా చూసినపుడు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా దీపక్‌రెడ్డి ఓటు వేసే అవకాశముంది.
దీంతో టీడీపీ కూటమి సంఖ్య 21కు చేరుతుంది. అంటే పూర్తిస్థాయిలో టీడీపీకే మెజార్టీ ఉందనటంలో సందేహం లేదు. ఒకవేళ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఓటును తిరస్కరించినా.. టీడీపీకే మెజార్టీ ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా.. తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న రీతిలోనే అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉండటం రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాలను సైతం ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. ఈ పరిణామాలను గమనించినట్లయితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు స్థానిక నేతలు నీళ్లొదులుతారా? నిలబెడతారా? అన్న చర్చకు తావిస్తోంది. ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయోనన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
పట్టు సడలకుండా జేసీపీఆర్ వ్యూహం
తాడిపత్రి ప్రజలిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్న దిశగానే.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆది నుంచీ ఆయన నిశితంగా మున్సిపల్ ఎన్నికలను గమనించటంలోనే నిమగ్నమయ్యారనటంలో సందేహం లేదు. గతంలో తాడిపత్రిలో చేసిన అభివృద్ధిని చాటుతూనే.. సేవ్ తాడిపత్రి నినాదంతో ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగిన విషయం తెలిసిందే. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో.. తన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులను కాపాడుకోవడంలోనే ప్రధానంగా దృష్టి సారించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియకు అభ్యర్థులెవరూ వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులందరినీ తన ఇంటికి పిలిపించుకున్నారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో పాటు.. మెజార్టీ స్థానాలు దక్కటంతో క్యాంపు రాజకీయానికి తెరలేపారు. అదేరోజు సాయంత్రం వారందరినీ తీసుకుని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ నెల 18న చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో అదేరోజు నేరుగా క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా జాగ్రత్త పడుతున్నారు. తాడిపత్రి ప్రజలిచ్చిన గౌరవానికి భంగం కలగకుండా పట్టణాభివృద్ధికి దోహదపడాలంటే చైర్మన్ స్థానం దక్కించుకోవాలనే దిశగానే ఆయన ప్రయత్నాలు ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కౌన్సిల్ సమావేశం రోజు అధికార పార్టీ ఎలాంటి ఎత్తుగడలు వేసినా.. వాటిని ఎదుర్కొనేందుకు జేసీపీఆర్ సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. చూడాలి మరి... ఏం జరుగుతుందో..?
పుత్ర వాత్సల్యం కోసమేనా..?
తాడిపత్రి మున్సిపాలిటీలో మెజార్టీ రాకపోయినా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల మద్దతు కోసం బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడటం వెనుక స్థానిక ముఖ్య నాయకుడి పుత్రవాత్సల్యం లేకపోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీలో తన కుమారుడిని పోటీ చేయించి, మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకే ఎన్నికల బరిలోకి దింపటంతోపాటు ఏకగ్రీవం చేసుకోవడంలోనూ ఆ వ్యూహం దాగుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ వర్గాల్లోనూ ఆది నుంచీ అదే చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడే ఆ పార్టీలో అసంతృప్తులకు తావివ్వడానికి ప్రధాన కారణమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రమంతా పథకాలు పనిచేస్తే.. తాడిపత్రిలో మాత్రం ఎందుకు పనిచేయలేదన్న ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లోనే తలెత్తుతోందన్న వాదన లేకపోలేదు. ప్రాధాన్యత పదవులన్నీ ఒకే కుటుంబానికే కావాలనే యోచన చేయడంతోనే ఆ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైందన్న వాదన లేకపోలేదు. మెజార్టీ స్థానాలు దక్కకపోవడానికి ఆ అసంతృప్తులు ఓ కారణమనటంలో సందేహం లేదన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఏదేమైనా.. మెజార్టీ స్థానాలు దక్కకపోయినా.. చైౖర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను లొంగదీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ క్రమంలో భాగంగానే.. టాటా మోటార్స్ దుకాణం నిర్వాహకులను బెదిరించారు. మద్దతివ్వకపోతే.. వ్యాపారాలు చేసుకోలేరనే స్థాయికి హెచ్చరికలు జారీ చేశారంటే దాని వెనుక పుత్రవాత్సల్యం తప్పా.. మరోటి లేదన్న అభిప్రాయం తాడిపత్రి పట్టణవాసుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం. మరిక్కడ జగన్ నినాదానికి కట్టుబడతారా..? ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా తప్పుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి మెజార్టీ సీట్లిచ్చినా.. అధికార పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు చేస్తున్న రాజకీయాలు పట్టణవాసులను విస్తుగొలుపుతున్నాయి.
Updated Date - 2021-03-17T05:46:50+05:30 IST