ఆ వ్యాపారులపై చర్యలెందుకు తీసుకోరు?
ABN, First Publish Date - 2020-05-09T10:18:15+05:30
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచి అమ్ముతున్నా... అధికారులు నామమాత్ర చర్యలతో చేతులు దులుపుకొంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వ్యాపారులతో అధికారులు కుమ్మక్కైనట్లుందని వ్యాఖ్యానించింది. అధిక ధరలకు అమ్ముతున్న
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచి అమ్ముతున్నా... అధికారులు నామమాత్ర చర్యలతో చేతులు దులుపుకొంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వ్యాపారులతో అధికారులు కుమ్మక్కైనట్లుందని వ్యాఖ్యానించింది. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ వారంలోగా చర్యల నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ సమయంలో కొందరు వ్యాపారులు నిత్యావసర సరుకులను విపరీతంగా పెంచి అమ్ముతున్నారంటూ వచ్చిన మీడియా కథనాలపై హైకోర్టు సుమోటోగా పిల్‌ను విచారణకు స్వీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శుక్రవారం నివేదిక ఇచ్చారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం కోడిగుడ్లు, టమోటోలు మినహా మిగిలిన అన్ని సరుకుల ధరలు విపరీతంగా పెంచారని గుర్తించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో సైతం 50శాతం కోత విధించారని, కొందరికి అసలు వేతనాలే చెల్లించని పరిస్థితులున్న నేపథ్యంలో అధిక ధరలకు అమ్ముతుంటే అధికారులు నామమాత్ర కేసులతో సరిపెట్టడాన్ని ఆక్షేపించింది.
Updated Date - 2020-05-09T10:18:15+05:30 IST