బాలల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2020-11-13T09:58:58+05:30
బాలల హక్కులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎ.శోభారాణి అన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి
ములుగు, నవంబరు 12: బాలల హక్కులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎ.శోభారాణి అన్నారు. జిల్లాలో ఆమె గురువారం పర్యటించారు. తొలుత జిల్లా సంక్షేమ ఆధికారి ప్రేమలతతో కలిసి ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌ను కలిశారు. బాల్య వివాహాలు, బాలకార్మికులు, బాలలపై లైంగిక దాడుల నేపథ్యంలో నమోదు అవుతున్న ఫోక్సో కేసుల వివరాలను తెలుసుకున్నారు. బాలల హక్కులను కాపాడేందుకు పోలీసు శాఖ సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్‌సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్ కె.జెండగేతో సమావేశం అయ్యారు. అంతకుముందు ఆమె వెంకటాపూర్(రామప్ప) మండలం లింగాపూర్ పంచాయతీ పరిధిలోని నందిపాడు గొత్తికోయగూడాన్ని సందర్శించారు. అందరికీ ఆధార్, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తాగునీటి సౌకర్యం, మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో బాలల హక్కుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. బాలలంటే కేవలం జనాభా లెక్కల్లో భాగంగా వారి నిండు జీవితాన్ని ఆదర్శవంతంగా గడిపేలా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాలలు గొప్పగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో పారిజాతం, డీఎంహెచ్‌వో అప్పయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, గిరిజన సంక్షేమాధికారి ఎర్రయ్య, సహాయ కార్మిక అధికారి షర్ఫొద్దీన్, ములుగు సీఐ దేవేందర్‌రెడ్డి, సీడీపీవోలు మల్లీశ్వరి, హేమలత, లక్ష్మి, ముత్తమ్మ, బీఆర్‌బీఐ కోఆర్డినేటర్ స్వాతి, డీసీపీవో ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T09:58:58+05:30 IST