సైబర్ నేరగాళ్ల సవాల్
ABN, First Publish Date - 2020-11-13T09:52:46+05:30
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చింది. సామాన్యులకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది.
సరికొత్త యాప్స్‌తో పోలీసులకు ముప్పుతిప్పలు
‘డింగ్ యాప్’తో చుక్కలు చూపించిన మెకానిక్ సాగర్
పక్కదారి పడుతున్న ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం
ఎప్పటికైనా నేరస్థులు చిక్కక తప్పదంటున్న పోలీసులు
వరంగల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చింది. సామాన్యులకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది. అయితే ఈ పరిజ్ఞానం నేరస్థులకు సైతం వరంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు ప్రజలకు ఆశ చూపించి నిలువుదోపిడీ చేస్తున్నారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ కంపెనీల అధిపతుల అకౌంట్లను సైతం హాక్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారుల ఫేస్‌బుక్ అకౌంట్‌లను సైతం హ్యాక్ చేసిన సంఘటన ఇటీవల జరిగింది. గత నెలలో మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య సంఘటనలో కూడా నేరస్థుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే.. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానం రూపంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
చదివింది ఏడు.. చేసేది మెకానిక్ పని..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రాష్ట్ర పోలీసుశాఖను కుదిపేసింది. మెకానిక్ సాగర్.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆపై ట్రాప్ చేయడానికి వీలులేని యాప్‌తో తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులను డిమాండ్ చేశాడు. ఇంటర్‌నెట్ కాల్ ద్వారా కిడ్నాపర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న పోలీసులు దీని వెనుక పెద్ద సైబర్ ముఠా ఉండి ఉంటుందని భావించారు. దీంతో సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ ఏ యాప్ నుంచి ఫోన్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. నేరస్థుడు స్కైప్ ద్వారా కాల్ చేయడంతో డింగ్ యాప్‌తో ఫోన్ చేస్తున్నాడని గుర్తించారు. వెంటనే అమెరికాలోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వివరాలు సేకరించారు.
అయితే కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని కిరాతకంగా చంపేశాడు. ఏమీ తెలియనట్టు బాలుడి బంధువులు, పోలీసుల మధ్యే ధైర్యంగా తిరిగాడు.. చివరకు ఒక సాధారణ మెకానికే నేరస్థుడని తెలిసి అందరూ అవాక్కయ్యారు. తన స్నేహితుడి ద్వారా డింగ్ యాప్ వివరాలు తెలుసుకుని కిడ్నాప్ పథకం రచించాడు. పోలీసుల కదలికలను గమనిస్తూనే పలుమార్లు డింగ్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ చేశాడు. ఇంటర్‌నెట్ సౌకర్యం మారుమూల పల్లెల్లోనూ అందుబాటులోకి రావడంతో సాగర్ వంటి నేరస్థులు భవిష్యత్తులో రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. నిజానికి ఏ యాప్ అయినా ట్రేస్‌అవుట్ చేయడానికి వీలుంటుందని కాకుంటే కొంచెం సమయం పడుతుందని పోలీసులు అంటున్నారు. నేరం చేసినా ఎవరికీ దొరకమనే భ్రమతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, తప్పనిసరిగా పోలీసులు గుర్తిస్తారన్న విషయం మాత్రం అర్థం చేసుకోవాలంటున్నారు.
సైబర్ వల.. జనం విలవిల..
మొబైల్‌ఫోన్ ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేని జీవనవిధానాన్ని ఊహించుకోవడం కష్టం. టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రజల దైనందిక జీవితాన్ని సులభరతం చేశాయి. అదే స్థాయిలో నేరస్థులు కూడా ఇంట్లో కూర్చునే ఇతరుల డబ్బులను దొంగిలించే అవకాశం ఏర్పడింది. పెద్ద ముఠాలుగా ఏర్పడి అర్ధరాత్రి వేళల్లో కత్తులు, గొడ్డళ్లు, తుపాకులతో దోపడీకి బయలుదేరాల్సిన అవసరం లేకుండాపోయింది. ఒక స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంటే చాలు రాజస్థాన్‌లోని ఒక కుగ్రామంలో ఉండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను దోపిడీ చేసే వీలు ఏర్పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నైజీరియా, సోమాలియా వంటి దేశాల్లో ఉండి కూడా మన దేశ బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బులను దొంగిలిస్తున్నారు.
సాంకేతిక నిపుణుల కొరత
పోలీసువ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఆధునీకరించాల్సిన అవసరముందన్న విషయం మహబూబాబాద్ కిడ్నాప్ కేసు తెలియజేసింది. కేసు తేల్చేందుకు హైదరాబాద్ నుంచి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సైబర్ క్రైం విభాగం నిపుణులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిబ్బంది కొరతతో పాటు పోలీస్ వ్యవస్థలో సాంకేతిక రంగ నిపుణుల కొరత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగాల బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - 2020-11-13T09:52:46+05:30 IST