ఆసరా అభయం
ABN, First Publish Date - 2020-06-01T09:06:01+05:30
పింఛను వస్తుందా రాదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! బిడ్డల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అగత్యం లేదు! ఇప్పుడు వారికో ‘ఆసరా’!
- ప్రతి కుటుంబానికీ సంక్షేమం
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): పింఛను వస్తుందా రాదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! బిడ్డల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అగత్యం లేదు! ఇప్పుడు వారికో ‘ఆసరా’! ఆడబిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సిన పని లేదు! వారికి అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్! చేనేతలకు బతుకు భరోసా! ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల బియ్యం! బీసీలకు గొర్రెలు, చేపపిల్లలు, నీరా, ఆబ్కారీ అండ! ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్యశ్రీ, వెల్‌నెస్ సెంటర్లు.. ఉచితంగా మందులు! వెరసి, ఆరేళ్లలో సంక్షేమ సిక్సర్! ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో సంక్షేమం! పేదల బతుకులు మారే దిశగా అడుగులు పడుతున్నాయి. సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.200 ఉన్న పింఛన్.. ఆరేళ్లలో రూ.2016కు చేరుకుంది.
దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.3,016కు పెరిగింది. అప్పట్లో తెలంగాణలో 26 లక్షల మంది పింఛనుదారులు ఉంటే.. ఇప్పుడు 38 లక్షల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు అర్హత వయసును కుదిస్తే.. వీరి సంఖ్య 48 లక్షలకు చేరనుంది. అప్పట్లో ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు పింఛన్ల వ్యయం రూ.12వేల కోట్లకు పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా రోగులూ పెన్షన్ లబ్ధి పొందుతున్నారు.
బడుగులకు బాసటగా..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దారిద్య్ర రేఖకు దిగువనున్న బడుగులకు కొండంత అండగా మారాయి. ఆడబిడ్డ పెళ్లికి సర్కారు రూ.1,00,116 ఇస్తుండడంతో ఒక భరోసా కలిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు లబ్ధి పొందినవారు 5లక్షల మందికి పైగానే ఉన్నారు. 5వేల కోట్ల వరకు లబ్ధిదారులకు అందించారు. ఎస్సీ, ఎస్టీల చేయూత అందించడానికి సబ్సిడీ రుణాల పథకాన్ని కూడా మెరుగ్గా అమలు చేస్తున్నారు. ప్రతి పేదకు 6 కేజీల వంతున బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది కూడా బడుగు, బలహీన వర్గాలే. నియోజకవర్గానికో గురుకులం పేరిట ఏర్పాటు చేసిన బీసీ గురుకులాలతో కనీసంగా లక్ష మంది బీసీ విద్యార్థులు ఉచితంగా గురుకుల విద్యను అభ్యసిస్తున్నారు. 20లక్షల సాయంతో విదేశాల్లో చదువుకోవాలనే వారి కల నిజమవుతోంది.
అమలు కానివి కొన్ని..: జనాభాలో 52 శాతం ఉన్న తమకు బడ్జెట్ కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయనే ఆవేదన బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈబీసీల కోసం ప్రత్యేక కార్యాచరణ ఆశించిన స్థాయులో ముందుకు సాగడం లేదు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గిస్తామన్న హామీ ఆచరణకు నోచుకోలేదు. నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి హామీ అమల్లోకి రాలేదు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం నిలిచిపోయింది. డబుల్ బెడ్‌రూం పథకమూ నత్తనడకన సాగుతోంది.
Updated Date - 2020-06-01T09:06:01+05:30 IST