కరోనా పంజా విసిరింది.. ఆ వర్గాలను కుంగదీస్తోంది: విజయశాంతి
ABN, First Publish Date - 2020-03-16T14:44:45+05:30
హైదరాబాద్: కరోనా పంజా విసిరిందని.. ఇది క్వారంటైన్ అవలంబించలేని పేద, మధ్యతరగతి వర్గాలను మరింత కుంగదీస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.
హైదరాబాద్: కరోనా పంజా విసిరిందని.. ఇది క్వారంటైన్ అవలంబించలేని పేద, మధ్యతరగతి వర్గాలను మరింత కుంగదీస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. హాస్పిటల్స్ అన్నీ కార్పోరేట్ ధోరణితో సామాన్యులపై కూడా వసూళ్ళ పడగ విప్పి.. పక్షపాత ధోరణిని అవలంభిస్తున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచమంతా నానాటికీ పేద, ధనిక వ్యవస్థలుగా మారిపోతూ... హాస్పిటల్స్ అన్నీ కార్పోరేట్ ధోరణితో సామాన్యులపై కూడా వసూళ్ళ పడగ విప్పి... పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్న పరిణామాలు సర్వసాధారణమైపోయాయి.
ఇప్పుడు ప్రకృతి సైతం ఆగ్రహించిందా? అన్నట్టు కరోనా పంజా విసిరింది. ఇది జీవనాధార అవసర దృష్ట్యా, నిత్యం ప్రజలతో కలసి పనిచేయాల్సిన పరిస్థితులలో... క్వారంటైన్ అవలంభించలేని మధ్యతరగతి, పేద వర్గాలను మరింత కుంగదీస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అన్ని వర్గాలకూ సమానంగా చికిత్స అందేలా... ప్రజల భద్రత కోసం సరైన తీరులో జాగ్రత్తలు వహిస్తాయని ఆశిస్తున్నాను. ప్రజలు కూడా వదంతులతో భయాందోళనలకు గురికాకుండా అవసరమైన జాగ్రత్తలన్నీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దైవం ప్రతి ఒక్కరినీ తన పిల్లలుగా దీవించి, ఏ చిన్న కష్టానికీ గురికాకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని విజయశాంతి పోస్ట్ పెట్టారు.
Updated Date - 2020-03-16T14:44:45+05:30 IST