ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణపతి బాటలోనే మల్లోజుల!

ABN, First Publish Date - 2020-09-02T09:40:40+05:30

మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత కూడా లొంగిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లొంగుబాటు దిశగా మావోయిస్టు మరో అగ్రనేత..
  • లొంగుబాటు దిశగా  వేణుగోపాల్‌
  • అనారోగ్య కారణాల వల్లే నిర్ణయం
  • ఉద్యమంలో 35 ఏళ్లుగా పలు బాధ్యతలు
  • 2010లో దంతెవాడలో 70 మంది 
  • జవాన్ల మృతి ఘటనలో ప్రమేయం!
  • కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు
  • లొంగుబాట్లకు రాష్ట్ర పోలీసుల గ్రీన్‌ సిగ్నల్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత కూడా లొంగిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలంగాణ పోలీసుల వద్ద ఉంది. కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావుతోపాటే వేణుగోపాల్‌ కూడా లొంగిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న భూపతి.. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్‌జీ అలియాస్‌ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్‌ తమ్ముడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లికి చెందినవారు. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో నాయకుడిగా మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అలియాస్‌ సోను అలియాస్‌ మాస్టర్‌ అలియాస్‌ అభయ్‌ పేర్లతో పనిచేశారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు మావోయిస్టు గెరిల్లా జోన్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ మరణం తర్వాత వేణుగోపాల్‌ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. పార్టీ ప్రచురణల విభాగంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్‌ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2011లో ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతి చెందిన తర్వాత వేణుగోపాల్‌ను పశ్చిమ బెంగాల్‌లోని ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్‌గఢ్‌ ఉద్యమానికి నాయకునిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీ్‌సగఢ్‌ పోలీసులు మల్లోజుల వేణుగోపాల్‌ తలపై పెద్ద మొత్తాన్ని రివార్డుగా ప్రకటించారు.


లొంగుబాట్లను స్వాగతించిన పోలీసులు

సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గణపతి వృద్ధాప్యంలో అనారోగ్యంతో  బాధపడుతూ లొంగుబాటుకు చేస్తున్న ప్రయత్నాలను  స్వాగతించారు. గణపతి బంధువులు, మిత్రులు, పత్రికల ద్వారా తన ఆంకాంక్షను తెలియజేయడం మంచి పరిణామమన్నారు. గణపతి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సహకారంతో నేరుగా రాష్ట్ర పోలీసులను సంప్రదించవచ్చన్నారు. గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న, సుధాకర్‌ వంటి అగ్రనేతల లొంగుబాటుకు సహకరించినట్లుగానే గణపతికి కూడా సహకరిస్తామని తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులందరికీ పునరావాసం, ఆరోగ్య సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర పోలీసులు మానవతా దృక్పథంతో సాయం చేశారన్నారు. లొంగిపోయిన వారికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పునరావాస పథకం కింద  1,137 మందికి సహాయ, సహకారాలు అందించినట్లు అధికారులు వివరించారు. గణపతి, వేణుగోపాల్‌తో పాటు ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామన్నారు. 


ప్రభుత్వ ఉద్యోగం వదిలి.. ఉద్యమంలోకి 

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): మల్లోజుల వేణుగోపాల్‌.. పెద్దపల్లిలో మధురమ్మ-వెంకటయ్య దంపతులకు 1956లో జన్మించారు. మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీకి సోదరుడు. వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. వేణుగోపాల్‌ పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన అనంతరం ఐటీఐలో రేడియో, టీవీ మెకానిజం కోర్సు చేశారు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. అమ్మమ్మ ఊరు కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేటలో సోదరుడు కోటేశ్వర్‌రావు, బుర్ర చిన్నన్న తదితరులతో కలిసి దొరలకు వ్యతిరేకంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యమాల్లో పాల్గొని అడవిబాట పట్టారు. అప్పటినుంచి ఆయన పెద్దపల్లి రాలేదు. 35 ఏళ్లకు పైగా   అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు పార్టీలోనే పని చేస్తున్న తారక్క అలియాస్‌ నర్మదక్కను వివాహం చేసుకున్నారు. ఆమె 2018 డిసెంబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.



సాహిత్య సృజనకారుడు..

ఒక చేత్తో గన్ను, మరో చేతితో పెన్ను పట్టుకుని ఉద్యమంలో పాల్గొన్న వేణుగోపాల్‌.. గిరిజన గోండు జీవితాలను అక్షరీకరించి, వారి జీవన స్థితిగతులను వెలుగులోకి తీసుకువచ్చారు. సాధన కలం పేరిట అనేక పుస్తకాలు రాశారు. సరిహద్దు, రాగో అనే రెండు నవలలను పోరాట పంథాలో మలిచి రాశారు. సరిహద్దు నవల 1985 తర్వాత కాలానికి సంబంధించినది. ఇందులో ఆదివాసీ, ఆదివాసీయేతర అనుభవాల సారాంశాన్ని వివరించారు. 1993లో గోండు భాషలో రాగో నవల రాశారు. రాగో అంటే గోండు భాషలో రామచిలుక అని అర్థం. మధ్య వయస్కురాలైన మాదియా అనే గోండు యువతి జీవితం గురించి ఇందులో వివరించారు. వేణుగోపాల్‌ తన కలం పేరును సాధన అని పెట్టుకోవడానికి కారణం ఒక చిన్నారి అని చెబుతుంటారు. తొలి రోజుల్లో మహదేవ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో వేణుగోపాల్‌ గెరిల్లా జీవితం గడుపుతున్నప్పుడు సాధన అనే చిన్నారి ఆయనకు ఎన్నో సేవలు అందించిందని, అందుకే ఆమె పేరునే తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేశారని అంటుంటారు. 

Updated Date - 2020-09-02T09:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising