ఖాళీ పోస్టుల వర్సిటీలు!
ABN, First Publish Date - 2020-12-29T06:51:06+05:30
విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించి.. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు.. బోధించే ఆచార్యులు లేక వెలవెలబోతున్నాయి
ఆచార్యులు లేక విశ్వవిద్యాలయాలు కుదేలు
పదేళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు
ఒక్క ఓయూలోనే 3 వేల ఖాళీలు
అతీగతీలేని మూడేళ్లనాటి 1061 పోస్టులు
పూర్తిస్థాయి వీసీల్లేక గాడితప్పిన పాలన
ఉన్నత విద్యలో కొరవడుతున్న నాణ్యత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించి.. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు.. బోధించే ఆచార్యులు లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. ఏళ్ల తరబడి గెస్ట్ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడుతోంది. కీలకమైన వైస్ చాన్సలర్ల పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉండడం, పాలకమండళ్లను నియమించకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో వర్సిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు 5 వేలకు పైగా ఉంటాయి.
ఇందులో 1061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా.. నేటికీ అవి భర్తీకి నోచుకోలేదు. ఇక బోధనేతర సిబ్బంది ఖాళీలు 15 వేలకు పైగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే 65 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధన సిబ్బంది 1246 మందికి కేవలం 427 మంది మాత్రమే ఉన్నారు. బోధనేతర సిబ్బంది 3500 మందికి గాను.. ప్రస్తుతం 1300 మంది మాత్రమే ఉన్నారు. మొత్తంగా 3019 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్, టైమ్ ేస్కల్ పద్ధతిలో కొన్ని పోస్టులను భర్తీ చేసి నెట్టుకొస్తున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఓయూలో చదివేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర దేశాల విద్యార్థులు వస్తుంటారు. కానీ, వారికి నాణ్యమైన విద్యను బోధించేందుకు పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగక.. అకాడమిక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించినప్పటి నుంచి ఉన్న ఉర్దూ విభాగంలో 19 మంది అధ్యాపకులకుగాను నలుగురే ఉన్నారు. సైకాలజీ విభాగంలో 11 మందికి .. ఉన్నది ఇద్దరే. ఇక ఫిలాసఫీ విభాగంలో ఇద్దరు మాత్రమే అధ్యాపకులున్నారు.
కెమిస్ర్టీ డిపార్ట్‌మెంట్‌లో 38 పోస్టుల ఖాళీలు, ఫిజిక్స్‌లో 36, ఎకనామిక్స్‌లో 35, ఇంగ్లి్‌షలో 32.. ఇలా పలు కీలకమైన విభాగాల్లో పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖాళీ పోస్టుల్లో 415 మాత్రమే భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. 219 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను, 121 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తును ఏడాదిన్నర క్రితమే పూర్తి చేశారు. కానీ, ఇప్పటికీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. మరోవైపు వీసీ పదవి ఖాళీ అయి రెండేళ్లు కావస్తున్నా.. భర్తీ చేయడంలేదు. ఇన్‌చార్జి వీసీగా మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో 519 ఖాళీలున్నాయి. ఇందులో బోధన విభాగంలో 15 ప్రొఫెసర్లు, 50 అసోసియేట్ ప్రొఫెసర్లు, 173 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర విభాగంలోనూ ఇంకా 281 మందిని భర్తీ చేయాల్సి ఉంది. మొత్తంగా బోధన విభాగంలో 60 శాతం, బోధనేతర విభాగంలో 70 శాతం ఖాళీలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో జరిగిన నియామకాలే ఇక్కడ ఆఖరు.
కాకతీయ వర్సిటీలో 73 శాతం ఖాళీయే..
రాష్ట్రంలో ఓయూ తర్వాత అతిపెద్ద విశ్వవిద్యాలయం కాకతీయ. ఇందులో బోధన సిబ్బందిలో ఏకంగా 73 శాతం ఖాళీలున్నాయి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కలిపి మొత్తం 403 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 108 మాత్రమే ఉన్నాయి. బోధనేతర సిబ్బంది 617 మందికిగాను 354 మంది మాత్రమే ఉన్నారు. కాగా, పాలమూరు వర్సిటీలో రెగ్యులర్ సిబ్బంది సంఖ్య కేవలం 25 మాత్రమే. ఇందులో 23 మంది బోధన, ముగ్గురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. మిగిలిన వారంతా తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ విభాగం వారే. 104 మంది కాంట్రాక్ట్, 150 మంది ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీకి 15 నెలలుగా వీసీ లేకపోవడంతో కొత్త నియామకాలు చేపట్టడంలేదు. పైగా తాత్కాలిక బోధన సిబ్బందిలో అర్హత, అనుభవం ఉన్నవారిని నియమించకుండా పైరవీలకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీకి ప్రభుత్వం మూడేళ్ల క్రితమే 61 బోధన సిబ్బంది, 56 బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేసినా.. యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వెలువడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నియామకాలపై కోర్టులో కేసు ఉన్నందున నోటిఫికేషన్ ఇవ్వలేకపోయామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ వర్సిటీలో 62 మంది మాత్రమే..
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 15 ఏళ్లు అవుతోంది. కానీ, ఇప్పటికీ పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేదు. 30 మంది ప్రొపెసర్లకుగాను ఐదుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్‌పై మహాత్మాగాంధీ వర్సిటీకి వెళ్లగా.. మరొకరు ఉన్నత విద్యామండలికి వెళ్లారు. 60 మంది అసోసియేట్ ప్రొపెసర్లకు గాను 9 మంది, 120 మంది అసిస్టెంట్ ప్రొపెసర్లకు గాను 48 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు ఉండడంతో 70 మంది అకడమిక్ కన్సల్టెంట్‌లు పనిచేస్తున్నారు. బోధనేతర సిబ్బంది రెగ్యులర్ 40 మంది ఉండాల్సి ఉండగా 8 మంది ఉన్నారు. ఇక నల్లగొండ జిల్లాలో 2007లో ప్రారంభమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. మొత్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. వివిధ కోర్సులకు సంబంధించి 145 మంది బోధన సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ఇందులో 60 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో రెగ్యులర్ సిబ్బంది నలుగురు మాత్రమే.
తెలుగు వర్సిటీలో 105కు 10 మందే..
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బోధన సిబ్బంది 105 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది 216మంది ఉండాల్సి ఉండగా 128మంది మాత్రమే ఉన్నారు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎ్‌ఫయూ)లో 55 మంది బోధన సిబ్బంది పోస్టుల మంజూరు ఉండగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. వీటితోపాటు 12 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఐదు డిమాండ్ కలిగిన కోర్సులను కాంట్రాక్టు సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. కాగా, దూరవిద్యను అందిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 86 బోధన సిబ్బంది పోస్టుల మంజూరు ఉండగా.. ప్రస్తుతం 39 మంది, బోధనేతర సిబ్బంది 198 మందికిగాను 83 మంది మాత్రమే ఉన్నారు.
Updated Date - 2020-12-29T06:51:06+05:30 IST