ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి
ABN, First Publish Date - 2020-06-01T08:45:46+05:30
కామారెడ్డి జిల్లా దోమకొండ కోట వారసుడు, మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.
పాడె మోసిన చిరంజీవి, రాంచరణ్
దోమకొండలో దహనసంస్కారాలు
అంత్యక్రియలకు ముందు తేనెటీగల దాడి
పలువురికి స్వల్పగాయాలు
కామారెడ్డి/దోమకొండ, మే31(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా దోమకొండ కోట వారసుడు, మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆదివారం ఆయన మృతదేహం దోమకొండకు చేరగా.. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కోటలోని వెంకట భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం స్థానిక ముత్యంపేట రోడ్డులోని లక్ష్మీబాగ్‌లో ఉమాపతిరావు అంతిమసంస్కారాలను ఆయన కుమారుడు అనిల్ కుమార్, కోడలు శోభన నిర్వహించారు.
అంత్యక్రియలకు సినీనటుడు చిరంజీవి దంపతులు, వారి తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరయ్యారు. ఉమాపతిరావు అంతిమయాత్రలో చిరంజీవి, రాంచరణ్ పాల్గొని పాడెను మోశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి ఉమాపతిరావుకు నివాళులర్పించారు.
అంత్యక్రియల్లో అపశ్రుతి
ఉమాపతిరావు అంత్యక్రియల్లో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన మృతదేహాన్ని వెంకటభవన్ నుంచి బయటకు తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. సందర్శకులు పరుగులు పెట్టగా.. చిరంజీవి దంపతులు, రాంచరణ్ దంపతులు, కామినేని కుటుంబసభ్యులను సెక్యూరిటీ సిబ్బంది భవనంలోకి తరలించారు. పలువురికి స్వల్పగాయాలు కాగా.. అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో అంత్యక్రియలు కాస్త ఆలస్యంగా జరిగాయి. అంత్యక్రియల్లో కామారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్ దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందాలాల్ పవర్ , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2020-06-01T08:45:46+05:30 IST