ఓటరు నమోదు నుంచే జంగ్!
ABN, First Publish Date - 2020-10-01T07:39:27+05:30
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే.. భావజాలాల మధ్య యుద్ధం. అందుకే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం నామమాత్రంగా ఉండేది. ఎక్కువగా....
‘ఎమ్మెల్సీ’ల గెలుపు కోసం పార్టీల కసరత్తు
మొదటిసారి ఓటరు నమోదుపై టీఆర్‌ఎస్ దృష్టి
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే.. భావజాలాల మధ్య యుద్ధం. అందుకే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం నామమాత్రంగా ఉండేది. ఎక్కువగా కమ్యూనిస్టులు, సంఘ్, గాంధీయ భావజాలాల మఽధ్యే పోటీ ఉండేది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు.. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడిన సందర్భాలు సైతం ఉన్నా యి. అలాంటి సీన్.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. రంగంలో ఉన్న అభ్యర్థులకు మద్దతు ఇచ్చే సంప్రదాయాన్ని వదిలేసి.. తామే అభ్యర్థులను ఖరారు చేసి రంగంలోకి దించే స్థాయికి చేరాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరాటం గురువారం నుంచే ప్రారంభం కానుంది. టీఆర్‌ఎస్ తొలిసారిగా ఓటర్ల నమోదుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఈ రెండు నియోజవకర్గాల్లో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఉప సంఘాలు వేయనున్న కాంగ్రెస్
రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగేందుకు సుమారు 50 మందికిపైగా పోటీ పడుతుండగా.. స్ర్కీనింగ్ చేయడానికి టీపీసీసీ ఉపసంఘాలను వేయనుంది. ఆ సంఘాలు నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున పేర్లను ఎంపిక చేసి.. నిర్ణయం కోసం అధిష్ఠానానికి పంపనున్నాయి. ముందుగా ఓటరు నమోదుపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 6 ఉమ్మడి జిల్లాల్లో ఓట్లను నమోదు చేయించే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు అప్పగించింది. ఇక, బీజేపీ సైతం ఆయా జిల్లాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన అనుబంధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఓటరు నమోదులో చురుగ్గా పాలుపంచుకోనున్నాయి. టీజేఎస్, యువ తెలంగాణ, తెలంగాణ ఇంటి పార్టీలు తమ వంతుగా ఓట్ల నమోదుకు కృషి చేస్తున్నాయి.
సోషల్ మీడియా వినియోగం
ఓటరు నమోదుతోపాటు ప్రచారానికీ రాజకీయ పార్టీలు.. సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్ వేదికల ద్వారా ఓటు నమోదుకు అవసరమైన పత్రాలు.. అర్హతలను పోస్టు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటర్ రీచ్ అవుట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Updated Date - 2020-10-01T07:39:27+05:30 IST