ఫోన్‌లోనే ట్రిపుల్ తలాక్!
ABN, First Publish Date - 2020-12-11T09:11:46+05:30
పాతబస్తీకి చెందిన యువతికి ఐదేళ్ల క్రితం సోమాలియా వాసితో వివాహం జరిగింది. కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు..
పోలీసులకు పాతబస్తీ యువతి ఫిర్యాదు
5 ఏళ్ల క్రితం సోమాలియా వాసితో పెళ్లి
తాజాగా ట్రిపుల్ తలాక్ చెప్పి.. ఫోన్ కట్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): పాతబస్తీకి చెందిన యువతికి ఐదేళ్ల క్రితం సోమాలియా వాసితో వివాహం జరిగింది. కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు.. ఆరు నెలలకోసారి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. రెండు నెలల క్రితం ఆమెకు ఫోన్ చేసిన అతడు.. ట్రిపుల్ తలాక్ చెప్పేసి పెట్టేశాడు. యువతి కుటుంబీకులు మళ్లీ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన తన భర్తపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని విదేశాంగ శాఖకు ఆమె లేఖ రాశారు.
పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన యువతి(24)ని అబ్దీ వలీ అహ్మద్‌కు ఇచ్చి 2015 జనవరి 25న వివాహం జరిపించారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో అతడిచ్చిన హామీ మేరకు కుటుంబీకులు ఒప్పుకోవడంతో ఇస్లాం సంప్రదాయం ప్రకారం వారి నికాహ్ జరిగింది. చదువు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లి, అక్కడే ఉంటున్న వలీ అహ్మద్.. ఆరు నెలలకు ఓసారి నగరానికి వచ్చి వెళ్లేవాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి సారిగా యూఎస్ నుంచి నగరానికి వచ్చిన వలీ అహ్మద్ కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి... అనంతరం తల్లిని కలవడానికి దుబాయ్ వెళ్లాడు. ఆ తర్వాత యూఎ్‌సలోని బోస్టన్‌కు వెళ్లిపోయాడు. గత సెప్టెంబరు వరకూ యువతి అవసరాల నిమిత్తం అతడు డబ్బులు పంపించాడు. అయితే.. అక్టోబరు 7న యువతి తండ్రి మహ్మద్ ఫరీద్ నంబర్‌కు ఫోన్ చేసిన వలీ అహ్మద్.. తండ్రి, సోదరుడు, సోదరి సమక్షంలో ఆమెతో మాట్లాడుతూ... ఎలాంటి కారణం చూపకుండానే తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఈ విషయమై దుబాయ్‌లో ఉన్న అత్త, లండన్‌లో ఉన్న భర్త సోదరికి ఫోన్ చేసి వివరించగా... కారణమేంటో కనుక్కుంటామని చెప్పి... వాళ్లు కూడా ఫోన్ నంబర్ బ్లాక్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తలాక్ పత్రాలు కూడా లేనందున తాను మరో పెళ్లి కూడా చేసుకోలేనని.. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖకు లేఖ రాసినట్లు ఆమె చెప్పారు.
Updated Date - 2020-12-11T09:11:46+05:30 IST