దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ABN, First Publish Date - 2020-12-11T08:10:14+05:30
దైవ దర్శనం కోసం ఆనందంగా బయలుదేరింది ఆ కుటుంబం.. మొక్కులు చెల్లించుకుని తిరుగుపయనమైన
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
మధిరటౌన్, డిసెంబరు 10: దైవ దర్శనం కోసం ఆనందంగా బయలుదేరింది ఆ కుటుంబం.. మొక్కులు చెల్లించుకుని తిరుగుపయనమైన వారు మరో గంటలో ఇంటికి చేరే వారే. కానీ.. అంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని కృష్ణా జిల్లా గరికపాడు ఫ్లైఓవర్ వద్ద గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పాన్ షాపు నిర్వాహకుడు మాచర్ల శ్యాం, అతడి భార్య శారదతో పాటు వదిన మాచర్ల భాగ్యమ్మ ఆమె కుమారుడు మాచర్ల నవీన్, కోడలు శ్యామల, మనుమరాలు మాన్యశ్రీతో కలిసి 8వ తేదీ రాత్రి మధిర నుంచి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో వరంగల్‌లో ఉంటున్న భాగ్యమ్మ చిన్న కుమారుడు ప్రవీణ్ ఇంటికి వెళ్లి అతడి పిల్లలు అక్షయ్, మనును తీసుకొని వేములవాడ వెళ్లారు. మొక్కులు చెల్లించుకుని దైవ దర్శనం పూర్తి చేసుకొన్నారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్-ఖమ్మం రోడ్డు బాగోలేకపోవడంతో సిద్దిపేట- సూర్యాపేట మీదుగా మధిరకు బయలు దేరారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొనడంతో శ్యాం(50)తో పాటు అతని భార్య శారద(45), శ్యామల (35) అక్కడికక్కడే మృతి చెందారు.
కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సైదులు స్వల్ప గాయాలతో బయటపడగా.. మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో మధిరలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2020-12-11T08:10:14+05:30 IST