గర్భశోకం
ABN, First Publish Date - 2020-05-09T10:28:07+05:30
ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. సకాలంలో వైద్యం అందక తల్లిగర్భంలోనే పిండం చనిపోయింది. జెనీలా ఘటన మరవక ముందే జోగులాంబ గద్వాల జిల్లాలో అటువంటి ఘటనలు
గద్వాల, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. సకాలంలో వైద్యం అందక తల్లిగర్భంలోనే పిండం చనిపోయింది. జెనీలా ఘటన మరవక ముందే జోగులాంబ గద్వాల జిల్లాలో అటువంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ఇటిక్యాల మండలం యక్తాపురం గ్రామానికి చెందిన జ్యోతికి శుక్రవారం తెల్లవారుజామున పురుటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను 3 గంటలకు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ పరీక్షలు చేశారు. కానీ, ప్రసవం చేసే వైద్యురాలు, సూపరింటెండెంట్ శోభారాణి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు. వచ్చిన వెంటనే గర్భిణిని లేబరు రూమ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేశారు. తల్లి కడుపులో శిశువు మృతి చెందిందని, తల్లి ప్రాణాన్ని రక్షించడానికి ఆపరేషన్ చేయాలని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని బాధితులకు శోభారాణి తెలిపారు. కడుపులో శిశువు చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. తాము తెల్లవారుజామున జ్యోతిని ఆస్పత్రికి తీసుకురాగా ఒక్క మహిళా డాక్టర్ కూడా రాలేదని బాధితులు వాపోయారు. చివరికి వారిని సముదాయించి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శోభారాణి మాట్లాడుతూ ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ప్లేట్‌లెట్లు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌కు పంపించామని చెప్పారు.
Updated Date - 2020-05-09T10:28:07+05:30 IST