ఆ ఇద్దరి వల్లే శ్రావణి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-09-14T09:21:22+05:30
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బుల్లితెర నటి శ్రావణి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ప్రేమ పేరుతో ఆమెకు
- దేవరాజ్, సాయికృష్ణ వేధింపులతోనే!
- నిర్ధారణకు వచ్చిన పోలీసులు
- నిర్మాతనూ ప్రశ్నిస్తామని వెల్లడి
అమీర్‌పేట, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బుల్లితెర నటి శ్రావణి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డి వేధింపులు భరించలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న దేవరాజ్ రెడ్డిని పోలీసులు గత మూడురోజులుగా పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. మరో నిందితుడు సాయికృష్ణా రెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాల్లో నటించాలనే కోరికతో 8 సంవత్సరాల కిందట శ్రావణి (26) కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు తన మిత్రురాలి ద్వారా.. అనంతపురానికి చెందిన సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. సినిమా పరిశ్రమలో తనకున్న పరిచయాలతో అతడు శ్రావణిని.. అశోక్ రెడ్డికి (అనంతరకాలంలో ఆర్‌ఎక్స్ 100 సినిమా తీశారు) పరిచయం చేశాడు.
‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాలో శ్రావణికి చిన్న పాత్ర ఇప్పించాడు. ఇలా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా ఆమెకు టీవి సీరియల్స్‌లో అవకాశాలు వచ్చి ఆర్థికంగా కొంత స్థిరపడడంతో శ్రావణి తల్లితండ్రులు, సోదరుడు కూడ ఆమె వద్దకు వచ్చారు. సాయికృష్ణ వారితో కూడా పరిచయం పెంచుకుని, తరచూ వారింటికి వచ్చిపోతుండేవాడు. ఇదిలా ఉండగా.. ఏడాది క్రితం టిక్‌టాక్ ద్వారా శ్రావణికి దేవరాజ్ రెడ్డితో పరిచయమైంది. తమ ప్రాంతం వాడే కావడంతో శ్రావణి అతడితో చనువుగా ఉంటూ తను ఉంటున్న ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుంచి దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో దేవరాజ్ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మళ్లీ ఈ నెల 7న పంజగుట్టలోని ఒక రెస్టారెంట్‌లో శ్రావణి, దేవరాజ్‌రెడ్డి ఉన్నట్లు తెలుసుకున్న సాయికృష్ణారెడ్డి అక్కడకు చేరుకున్నాడు. దేవరాజ్‌తో గొడవపడి శ్రావణిని అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టాడు. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులు, సాయికృష్ణా రెడ్డి తనను వేధించారని, కొట్టారని.. వారి ముఖం చూడదల్చుకోలేదని వారి ఆగడాలు భరించలేక అత్మహత్య చేసుకుంటానని శ్రావణి అంటున్న ఆడియో రికార్డును దేవరాజ్ పోలీసులకు అందజేశాడు. ఇద్దరినీ విచారించిన పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు ఇద్దరు కారణమనే నిర్ధారణకు వచ్చారు. వారిని రిమాండ్‌కు తరలించి.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న నిర్మాత అశోక్‌రెడ్డిని కూడ విచారించనున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-09-14T09:21:22+05:30 IST