వచ్చే ఎన్నికల్లో టార్గెట్ 79
ABN, First Publish Date - 2020-10-03T09:09:15+05:30
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 39 నెలలకు ముందే సుదీర్ఘ యుద్ధానికి సన్నద్దమయ్యామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్ అన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 79 సీట్లను
2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పొరపాట్లను సరిదిద్దుకుంటాం
అభ్యర్థి నిర్ణయంలో గెలుపు అవకాశమూ ముఖ్యమే
చివరి నిమిషం వరకూ హడావుడి ఉండబోదు
ప్రజల మద్దతు ఉన్న నాయకత్వాన్ని గుర్తిస్తాం
పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారికి ప్రాధాన్యం
‘ఆంధ్రజ్యోతి’తో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఠాగూర్
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 39 నెలలకు ముందే సుదీర్ఘ యుద్ధానికి సన్నద్దమయ్యామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్ అన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 79 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంటామన్న ఆయన.. అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషం వరకు హడావుడి ఉండబోదని స్పష్టత ఇచ్చారు. ఈ సుదీర్ఘ యుద్ధానికి అభ్యర్థులనూ సిద్ధం చేయాలనుకుంటున్నామని చెప్పారు.
క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు, పార్టీ పట్ల అంకిత భావం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ప్రజల కల నెరవేరడంలేదని, కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అభిప్రాయాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికలోనే వినిపించాలని, మీడియాకు, సోషల్ మీడియాకు ఎక్కితే సహించేది లేదన్నారు. నూతనంగా ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించిన మణిక్కం ఠాగూర్ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాష్ట్రంలో 2014 ఎన్నికల నుంచీ కాంగ్రెస్ ఓటమినే చవిచూస్తోంది. ఈ పరిస్థితిని ఎలా మారుస్తారు?
తెలంగాణ ఏర్పాటు ప్రజల కల. ఆ కలను ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సాకారం చేశారు. కానీ ప్రజల కల ఇంకా నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబంలోనే రాష్ట్రం బందీ అయింది. కేసీఆర్, అతని కుమారుడు, మేనల్లుడు కన్న కలలు మాత్రమే సాకారమయ్యాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 79 సీట్లు గెలుచుకోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో మా లక్ష్యాన్ని ప్రకటించాం. మెదక్ లోక్‌సభ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు సంగారెడ్డిలోనే ఆమె నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆమె గెలుపు స్ఫూర్తితో లక్ష్యాన్ని సాధిస్తాం.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు?
రాష్ట్రంలోని రెండు ఉమ్మడి జిల్లాలకే బీజేపీ పరిమితం. ప్రస్తుతం ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న 4 ఎంపీ స్థానాల్లో రెండు స్థానాలు స్థానిక పరిస్థితుల దృష్ట్యా గెలించింది. గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి 9ు లోపే ఓట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు బీజేపీని అంగీకరించబోరు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటును సమీకరించిన ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి రాగలిగారు. బీజేపీ గురించి ఆందోళన చెందాల్సింది టీఆర్‌ఎస్ పార్టీనే. ఢిల్లీలో ఒకరికొకరు సహకరించుకుంటున్న టీఆర్‌ఎస్, బీజేపీలు.. రాష్ట్రంలో మాత్రం భిన్నవాదనను వినిపిస్తున్నాయి.
క్రమశిక్షణ తప్పే నేతల నియంత్రణ ఎలా?
పార్టీ కోర్ కమిటీలోను, ఆ తర్వాత జరిగిన సమీక్షల్లోనూ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశాను. ఎవరైనా అభిప్రాయాలు, వ్యూహాలు చెప్పాలనుకుంటే పార్టీ వేదికలపైనే వివరించాలని చెప్పాను. నాతోను, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శులతోనూ చెప్పవచ్చు. అంతే కానీ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మీడియాకు, సోషల్ మీడియాకు ఎక్కితే సహించేది లేదు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారు కదా?
కొంత మంది.. వారి ఆత్మగౌరవాన్ని, పదవిని డబ్బులకు అమ్మేసి ఉండవచ్చు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టాం. చివరి నిమిషంలో హడావుడి పడడం వంటి తప్పులు చేయకూడదనుకున్నాం. అందుకే లక్ష్యాన్ని మూడేళ్ల ముందే నిర్ణయించుకున్నాం. సుదీర్ఘ యుద్ధానికి అభ్యర్థులను సిద్ధం చేయాలనుకుంటున్నాం.క్షేత్రస్థాయిలో ప్రజలు, పార్టీ కేడర్ మద్దతున్న.. పోరాటం చేయగలిగిన నాయకత్వాన్ని గుర్తిసాం. పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తాం.
పార్టీకి పూర్వవైభవం ఎలా తీసుకువస్తారు?
మండల స్థాయిలో కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటి తలుపునూ కాంగ్రెస్ కార్యకర్తలు తట్టనున్నారు. ఇందులో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో జరిగే నష్టాన్ని వివరించేందుకు రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతులను మా పార్టీ నేతలు కలుస్తున్నారు. రైతాంగాన్ని మోదీ సర్కారు.. అంబానీ, అదానీలకు అప్పగిస్తున్న వైనాన్ని వివరిస్తాం. పంటను ప్రభుత్వం కొనట్లేదు. అంబానీ, అదానీలే ధరలు నిర్ణయిస్తారన్న విషయాన్ని వారికి చెబుతాం.
పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందా?
పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లుగా ఒకరిద్దరు మాత్రమే నాకు చెప్పారు. నిర్ణయం తీసుకునేది సోనియా, రాహుల్‌గాంధీ. అందుకే నేను టీం ఆఫ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. టీంలో ధోనీ, కోహ్లీ, శిఖర్ థవన్ ఎవరి ఆట వారు ఆడవచ్చు. టీం స్పిరిట్ ఉండాలి. కెప్టెన్ మాత్రం లక్ష్య సాధన కోసం పనిచేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెటే పవర్‌ఫుల్. కేసీఆర్ ఫ్యామిలీ, జగన్‌రాజ్‌లలాగా ఉండదు.
బీసీల విశ్వాసాన్ని ఎలా చూరగొంటారు?
కాంగ్రె్‌సలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుంది. వారిలో నాయకత్వాన్నీ తయారు చేస్తుంటాం. క్షేత్రస్థాయిలోనూ వారికి నాయకత్వ అవకాశాలను కల్పిస్తాం.
పార్టీలో ప్రజాకర్షక నేతలకు, సీనియర్ నేతలకు మధ్య గ్యాప్‌ను ఎలా పూరిస్తారు?
అందుకే టీం స్పిరిట్ కావాలంటున్నాను. పార్టీలో సీనియర్లు సహా అందరికీ స్థానం ఉంటుంది.
దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?
దుబ్బాకకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ జిల్లా నేతలు ఎంపిక చేసిన అభ్యర్థి పేరును అధిష్ఠానానికి పంపుతాను. జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికను వికేంద్రీకరిస్తున్నాం. నేనుకానీ, టీపీసీసీ అధ్యక్షుడు కానీ అభ్యర్థిని నిర్ణయించబోం. అభ్యర్థి ఎంపికకు నిబంధనలు రూపొందించి బాధ్యతను స్థానిక నాయకత్వాలకే ఇస్తాం. అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించే బాధ్యత వాటిదే.
Updated Date - 2020-10-03T09:09:15+05:30 IST