ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
ABN, First Publish Date - 2020-06-01T16:23:22+05:30
సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కళకళలాడింది. జనాలతో స్టేషన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులతో సందడిగా మారింది
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కళకళలాడింది. జనాలతో స్టేషన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులతో సందడిగా మారింది. టికెట్లు బుక్ చేసుకున్నవారంతా తెల్లవారుజామే స్టేషన్‌కు చేరుకున్నారు. టెస్టులు చేసి లోనికి పంపించడంతో కిలోమీటర్ల కొద్ది జనాలు క్యూలైన్‌లో నిలబడ్డారు. గంటల కొద్దీ లైన్లో నిలబడడంతో పిల్లలు, స్త్రీలు నానా ఇబ్బందులు పడ్డారు.
2 స్టేషన్ల నుంచి 9 రైళ్లు..
సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి 9 రైళ్లు నడవనున్నాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. టికెట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. అలాగే ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరి చేశారు. ఇక ఆహారం, నీరు, బెడ్‌షీట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల గుండా వెళ్లే రైళ్లు ఇవే..
సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-ముంబై హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-దానాపూర్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (వయా... సికింద్రాబాద్) రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండు సార్లు) కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (వయా.. సికింద్రాబాద్) రైలు కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది.
పాటించాల్సిన సూచనలు..
రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాలు ముందే స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్ర్కీనింగ్ సమయంలో కోవిడ్-19 లక్షణాలుంటే ప్రయాణాలకు అనుమతించరు. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, కేన్సర్‌తో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, 10ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్లకు పైబడిన వృద్ధులు ప్రయాణం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-06-01T16:23:22+05:30 IST