వాళ్లను వదలొద్దు
ABN, First Publish Date - 2020-10-01T07:56:39+05:30
హేమంత్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ సజ్జనార్‌ను ఆయన భార్య అవంతి, ఆమె అత్తమామలు లక్ష్మీరాణి,....
సజ్జనార్ కాళ్లమీద పడ్డ అవంతి
హంతకులను శిక్షించాలని వేడుకోలు
రక్షణ కల్పించాలని కోరిన ఆమె అత్తమామలు
పోలీసుల కస్టడీకి లక్ష్మారెడ్డి, యుగేంధర్‌రెడ్డి
5రోజుల పాటు విచారణ.. సీన్ రీకన్‌స్ట్రక్షన్
హైదరాబాద్ సిటీ, గచ్చిబౌలి, చందానగర్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): హేమంత్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ సజ్జనార్‌ను ఆయన భార్య అవంతి, ఆమె అత్తమామలు లక్ష్మీరాణి, మురళీకృష్ణ, మరిది సుమంత్ వేడుకున్నారు. తన భర్తను చంపిన వారిని వదలొద్దంటూ అవంతి, సజ్జనార్ కాళ్లపై పడినట్లు తెలిసింది. అత్తామామలు, మరిదితో కలిసి అవంతి బుధవారం ఉదయం కమిషనరేట్‌లో సజ్జనార్‌కు వినతిపత్రం అందజేశారు. నిందితుల నుంచి బెదిరింపులు ఆగడంలేదని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు, వాయిస్ రికార్డులను సీపీకి అందజేశారు. అవంతి, హేమంత్ పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలను వారి నుంచి సీపీ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారినే కాకుండా ఇంకా ఎంతమందికి ఈ హత్యలో భాగస్వామ్యం ఉందో.. వారందరికీ చట్ట ప్రకారం శిక్షపడేలా చూస్తామని అవంతికి, హేమంత్ తల్లిదండ్రులకు సజ్జనార్ హామీ ఇచ్చారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, ఆమె మేనమామ యుగేంధర్‌రెడ్డిని కస్టడీకి తీసుకున్నామని, వారితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి ఎవరిపాత్ర ఏమిటనేది తేలుస్తామని హామీ ఇచ్చారు. రక్షణ కల్పించే విషయమై స్థానిక పోలీసులతో మాట్లాడతానని చెప్పారు. బెదిరింపు కాల్స్ రికార్డులను పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా హేమంత్ హత్య కేసులో ప్రధాన నిందితులు లక్ష్మారెడ్డి, యుగేంధర్ రెడ్డిని కోర్టు అనుమతితో గచ్చిబౌలి పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఇద్దరినీ చర్లపల్లి జైలు నుంచి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా ఇద్దరితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలిసింది. కాగా హేమంత్, కులోన్మాదానికి బలయ్యారని, కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం హేమంత్ ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, పీవైఏల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, పీడీఎ్‌సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాములు, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, ఎస్‌ఎ్‌ఫఐ నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T07:56:39+05:30 IST