వడ్డనకు వేళాయె..
ABN, First Publish Date - 2020-03-17T09:39:10+05:30
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ భూముల విలువ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈ సారి ఆశల బడ్జెట్ పెట్టుకున్నాం. అందుకే కొంత మేర ఆదాయం పెంచుతాం’’ అని సీఎం
- భూ రిజిస్ట్రేషన్, మద్యం మరింత ప్రియం!
- రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుతాం
- వీలైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతాం
- ఇసుక ఆదాయాన్ని ఆరేడు వేల కోట్లు చేస్తాం
- రాష్ట్రం నుంచి కేంద్రానికి 1.62 కోట్ల ఆదాయం
- పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
- కాంగ్రెస్, బీజేపీలవి అన్నీ డ్రామాలే
- మాది సన్నాసుల మఠమనుకుంటున్నారా?
- పద్ధతి తప్పితే మౌనంగా కూర్చోం: కేసీఆర్
ఆర్టీసీ చార్జీలను పెంచారు, కరెంటు చార్జీలను పెంచబోతున్నారంటూ విమర్శలు చేయడం తగదు. ఆ సంస్థల మనుగడ కోసమే చార్జీల పెంపు. 24 గంటల నాణ్యమైన కరెంటు ఉండాలంటే విద్యుత్ చార్జీలు పెంచక తప్పదు. చార్జీలు పెంచుతాం. భరించాలి. దీనిపై వెనక్కు వెళ్లం. మోసం చేయం, నటించం’’
- సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ భూముల విలువ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈ సారి ఆశల బడ్జెట్ పెట్టుకున్నాం. అందుకే కొంత మేర ఆదాయం పెంచుతాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూముల విలువలను పెంచడం ద్వారా ఈ శాఖ ఆదాయాన్ని పెంచుకోనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. సమాజం, ప్రజలు నష్టపోకుండా రాష్ట్ర ప్రగతికోసం పనిచేస్తామని, రాష్ట్రానికి దెబ్బ తగలనీయబోమని స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. కష్టపడి సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన చెప్పారు. కరోనా, ఆర్థికమాంద్యం ఉన్నా వనరులు సమకూర్చుకుంటామని వెల్లడించారు. గనుల శాఖ నుంచి ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. గతంలో ఇసుక ఆదాయం కేవలం రూ.40 కోట్లుగా ఉందేదని, ఈ సారి ఆరేడు వేల కోట్లకు ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. తాగినవాడే తాళ్లపన్ను కట్టాలని, వీలైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొన్నింట్లో ఆదాయం పెంచుకోవాలని, కొన్నింటిలో లీకేజీలు తగ్గించుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్నిమార్గాల ద్వారా రూ.1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, సవరణ బడ్జెట్‌తో మరో 20 వేల కోట్లు సాధిస్తామని వెల్లడించారు.
చార్జీల పెంపు తప్పదు
ఆర్టీసీ చార్జీలను పెంచారు, కరెంటు చార్జీలను పెంచబోతున్నారంటూ విమర్శలు చేయడం తగదని సీఎం అన్నారు. ఆ సంస్థల మనుగడ కోసమే చార్జీల పెంపు అని చెప్పారు. 24 గంటల నాణ్యమైన కరెంటు ఉండాలంటే విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని పేర్కొన్నారు. ‘‘చార్జీలు పెంచుతాం. భరించాలి. దీనిపై వెనక్కు వెళ్లం. మోసం చేయం, నటించం’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం అని తాను అనలేదని, లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి అంత కంటే ఎక్కువే ఇచ్చామని అన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదన్నారు. ‘‘ప్రభుత్వాన్ని మీకు(కాంగ్రెస్) అప్పగిస్తాం... 50 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలిస్తారా? అని సవాలు విసిరారు. తాము సిద్ధమేనంటూ భట్టి సమాధానమిచ్చారు. మీకు అధికారం అప్పగిస్తే రాష్ట్రం పరిస్థితి శంకరగిరి మాన్యాలేనని సీఎం వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అందరికీ ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంనుంచి రూ.2,72,926 కోట్లు కేంద్రానికి వెళ్లిందని కేసీఆర్ అన్నారు. ఇందులో వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది.. రూ.1,12,854 మాత్రమేనన్నారు. రూ.1.62 లక్షల కోట్లు కేంద్రానికే చేరాయన్నారు. రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వండంలేదని దుయ్యబట్టారు. తాము చేస్తున్న అప్పులను వ్యవసాయం వంటి రాబడి రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నామని వెల్లడించారు. ఇది రెండేళ్లలో మిగులుగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
పోడు సమస్యను పరిష్కరిస్తాం..
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను వందశాతం పరిష్కరిస్తామని, దానిపై ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఏటా రూ.10 వేల కోట్ల వంతున ఐదేళ్లు రూ.50 వేల కోట్లను ఖర్చు చేస్తామన్నారు. పట్టణాలల్లో సమస్యలను పరిష్కరించినందునే మునిసిపల్ ఎన్నికల్లోనూ తాము గెలిచామన్నారు. కొన్ని మునిసిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న భగీరథ పనులను పూర్తి చే స్తామని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే..
కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని, రెండూ డ్రామా కంపెనీలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతు ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధరను నిర్ణయిస్తుందన్నారు. కానీ, రైతుల ఉత్పత్తులను పరిమితంగానే కొనుగోలు చేస్తోందన్నారు. కందులను కేంద్రం పరిమితంగానే కొనుగోలు చేసిందని, కొనుగోలుకు తాను రూ. 300 కోట్లు విడుదల చేశానని చెప్పారు. ఆ తర్వాతే మరో లక్ష టన్నులు కొంటామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల ఉత్పత్తుల కొనుగోలుపై బాధ్యత తీసుకునేలా ప్రధానికి లేఖ రాస్తానన్నారు. గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టిన రైతులకు రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని కూడా విడుదల చేశామన్నారు. రబీలోనూ 39.19 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. తద్వారా 225 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంద న్నారు. షుగర్ ప్రీ ధాన్యం పంజాబ్ తరువాత రాష్ట్రంలోనే సాగవుతోందన్నారు.
మాది సన్నాసుల మఠమనుకున్నారా?
కాంగ్రెస్ నేతలు హుందాగా మాట్లాడితే తాము కూడా హుందాగా మాట్లాడతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పద్ధతి తప్పి మాట్లాడితే మాత్రం మౌనంగా కూర్చోబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.‘‘భట్టి నుంచి తాను పొగడ్తలు ఆశించలేదు. కానీ మంచిని మంచి అనాలి. అన్నింటినీ ఒకే గాటన పెట్టి మాట్లాడతారా? ‘మీది రాజకీయ పార్టీ.. మాది సన్నాసుల మఠం’ అనుకుంటున్నారా? రాజకీయంగానే సమాధానం చెబుతాం’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోందని కాగ్ చెప్పిన విషయాన్ని చేశారు. కేంద్రం, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర అభివృద్ధిని పలు సందర్భాలల్లో ప్రశంసించారని చెప్పారు. రైతు బంధును ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.5 లక్షలుగా ఉన్న జీఎ్‌సడీపీ ప్రస్తుతం రూ.9,69,604కు చేరుకుందన్నారు. గత ప్రభుత్వాల హయంలో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న రైతులు ప్రస్తుతం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. ‘‘చరిత్రలో ఎప్పడైనా ఎస్సారెస్పీ నీరు ఎల్‌ఎండీ దిగువన 125 రోజులు కనిపించిందా? ఇప్పుడు సజీవంగా నీరుంది. కాంగ్రెస్, టీడీపీల హయాంలో గతంలో ఈ పరిస్థితి కనిపించిందా?’’ అని నిలదీశారు. తలసరి ఆదాయంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపామన్నారు.
బీడీ కార్మికులకు ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా?
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి పేదలది ఘోరమైన పరిస్థితి అని అన్నారు. ప్రస్తుతం వారికి తాము రూ.2016 పింఛను అందిస్తున్నామని చెప్పారు. నాడు బంగారు తల్లి పేరిట ఎప్పుడో డబ్బులు ఇచ్చే వారని, నేడు కల్యాణలక్ష్మి పేరిట రూ.1,00,116 ఇస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో మద్యం బంద్ చేశారా? నాడు బెల్టు షాపులే లేనట్లు వారేదో పవిత్రులన్నట్లు మాట్లాడితే ఎలా అంటూ ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేమన్న విషయాన్ని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లాలో త్వరలోనే మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Updated Date - 2020-03-17T09:39:10+05:30 IST