డబుల్ కాస్ట్
ABN, First Publish Date - 2020-04-23T09:34:26+05:30
కరోనా వైర్‌సకు అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్ ప్రతిఒక్కరినీ ఇబ్బందులకు గురిచేస్తుంది. కానీ కిరాణ వ్యాపారులకు మాత్రంగా వరంగా మారింది.
లాక్‌డౌన్‌తో నిత్యావసర సరుకుల రేట్లకు రెక్కలు
ఏ వస్తువు కొన్నా రెట్టింపు ధర పెట్టాల్సిందే..
కిరాణ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
సామాన్యులను నిలువు దోపిడీ చేస్తూ మోసాలు
పట్టించుకోని అధికారులు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చేలా చేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ.. వ్యాపారులు ప్రతి వస్తువు మీద రెట్టింపు ధరలు తీసుకుంటున్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని నిలదీస్తే ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ధరలు పెంచి అమ్ముతున్నారు.
పరిగి: కరోనా వైర్‌సకు అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్ ప్రతిఒక్కరినీ ఇబ్బందులకు గురిచేస్తుంది. కానీ కిరాణ వ్యాపారులకు మాత్రంగా వరంగా మారింది. లాక్‌డౌన్‌ను త మకు అనుకూలంగా మార్చుకొని జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ధరల పెంపుపై అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా పరిగి పట్టణంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో పది రోజుల నుంచి నిత్యావసర దుకాణాలను మూసిఉంచుతున్నారు. దీంతో సరుకుల కోసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపల్ అధికారులు పాలు, కూరగాయలు, సరుకులు, మందులు ఇళ్ల వద్దకే డోర్‌డెలివరీ చేయిస్తామని చెబుతున్నా అమలు కావడం లేదు. దీంతో జనం నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
రెట్టింపైన ధరలు
నిత్యావసర సరుకుల ధరలు లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత పరిశీలిస్తే రెండింతలు పెరిగాయని జనం అంటున్నారు. కంది, పెసర పప్పులు లాక్‌డౌన్‌కు ముందు కిలో రూ.80 నుంచి రూ.100 ఉండగా, ప్రస్తుతం రూ.140 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. 25రోజుల వ్యవధిలో ధరలు అమాంతం రెండింతలు పెంచి అమ్ముతున్నారు. నూనె కిలో రూ.20 నుంచి రూ.30 పెంచేశారు. కిలో నూనె రూ.135 వరకు విక్రయిస్తున్నారు. చక్కెర, టీ పౌడర్, కారం, చింతపండు, ఇతర వస్తువులన్నీ 25 నుంచి 40 శాతం వరకు ధరలు పెంచారు. ఇప్పుడే ఇలాఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ.. అవసరాల మేరకు రవాణా అవుతున్నా కొరత సాకు చూపించి ధరలు పెంచి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
చివరకు ఇడ్లి, ఉప్మా రవ్వ ధరలకు కూడా కిలోకు రూ.15కుపైనే పెంచి అమ్ముతున్నాంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిగి పట్టణంలో అయితే వ్యాపారులు పాత సరుకులను కూడా కొత్త ధరలకే విక్రయిస్తున్నారు. కొడంగల్ చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేసిన మాల్‌లో ధరల విషయంపై ఘర్షణ చోటుచేసుకుంది. ధరలపై ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ.. ఎదురుదాడికి దిగారు. దోమ మండలంలో పని చేసే ప్రథమశ్రేణి ఓ అధికారి చిన్నరైతుపై తన ప్రతాపాన్ని చూపించారు. తెలిసోతెలియక ఒక లీటరు పాలు రూ.60కి బదులు రూ.70 అని చెప్పిన పాపానికి సదరు అధికారి, రైతును రోజంతా పోలీస్‌స్టేషన్‌లో పెట్టించి కొట్టించారు. పేదలకు అండగా ఉండాల్సిన అధికారే ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నిత్యావసర సరుకులపై జరుగుతున్న దోపిడీపై మాత్రం ఎవరూ స్పందించరని విమర్శలు వస్తున్నాయి.
కనిపించని ధరల పట్టిక
కిరాణ దుకాణాల్లో సరుకుల ధరల పట్టిక కచ్చితంగా ఉండాలి. కానీ ఏ దుకాణంలో అది కనిపించడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే వ్యాపారులు జనాన్ని దోపిడీకి గురి చేస్తున్నారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, గ్రేన్ పర్చేజింగ్ అధికారులు కిరాణ షాపుల్లో తనిఖీలు చేసి ధరలను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. షాపుల దగ్గర ధరల పట్టిక ఉంచి ఫిర్యాదు శాఖల అధికారుల నంబర్లు రాయించాలంటున్నారు.
ధరలు పెంచి అమ్ముతున్నారు - వెంకటయ్య, పరిగి
లాక్‌డౌన్‌తో దుకాణాలు మూసి ఉంచుతున్నారు. అయితే కిరాణషాపులు తెరిచినప్పుడు మాత్రం ధరలు పెంచి అమ్ముతున్నారు. మార్చిలో కిలో కందిపప్పు రూ.80లు ఉండే, ఇప్పుడు రూ.130కి పెంచారు. ఇదొక్కటే కాదు.. అన్నిరకాల సరుకుల ధరలు పెంచి అమ్ముతున్నారు. ధరలపై అడిగితే కొరత ఉంది. మీ ఇష్టం ఉంటే కొనండి.. లేదంటే వెళ్లండని సమాధానం ఇస్తున్నారు. అధికారులు సరుకుల ధరలను నియంత్రించాలి.
Updated Date - 2020-04-23T09:34:26+05:30 IST