యాసంగికి రైతుబంధు
ABN, First Publish Date - 2020-12-30T03:57:49+05:30
యాసంగి పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు పెట్టుబడి సహాయం
- పెట్టుబడి సాయం పంపిణీ షురూ..
- తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.57 కోట్లు
- మొదట తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు సాయం
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : యాసంగి పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు పెట్టుబడి సహాయం సోమవారం వికారాబాద్ జిల్లాలో 98వేల మంది రైతుల ఖాతాల్లో రూ.57 కోట్లు జమయ్యాయి. ప్రాధాన్యతాక్రమంలో మొదట తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు రైతుబంధు సహా యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యాసంగి పంటలు సాగు చేసేందుకు జిల్లాలో 2,30,639మంది రైతులకు రూ.310,76,81,571 పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల ప్రారంభమైన యాసంగి పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతులు ఇతరుల వద్ద అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వమే ఎకరాకు రూ.5 వేల వంతున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం ప్రారంభించిన ప్రభుత్వం వచ్చేనెల 7వ తేదీ వరకు రోజుకు కొందరు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మొదట తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో, ఆ తరువాత ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. వివిధ కారణాలతో ఎవరైనా రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కాకపోతే వెంటనే సమస్యను పరిష్కరించి వారికి రైతుబంధు అందేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కొత్తగా 7 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో కొత్తగా 7వేల మంది రైతులు రైతుబంధుకు అర్హత పొందారు. ఈనెల 10వ తేదీ వరకు పట్టా పాసుపుస్తకాలు అందిన రైతులు పెట్టుబడి సాయం కోసం ఏఈవోలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సీజన్‌లో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,30,639 మంది రైతులు రైతుబంధు సాయానికి అర్హత పొందారు. వీరిలో వానాకాలం సీజన్‌లో 2,23,639 మంది రైతులకు పెట్టుబడి సాయం అందగా, కొత్తగా మరో 7వేల మంది అదనంగా యాసంగి సీజన్‌లో రైతుబంధుకు అర్హత పొం దారు. యాసంగి సీజన్ నుంచి వారికి కూడా ఎకరాకు రూ.5 వేల వంతున పెట్టుబడి సాయం అందనుంది. ప్రతి ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో ఎకరాకు రైతులు రూ.10 వేల వంతున రైతుబంధు సాయం పొందనున్నారు.
Updated Date - 2020-12-30T03:57:49+05:30 IST