రోడ్లను అడ్డంగా తవ్వేశాడు!
ABN, First Publish Date - 2020-12-28T05:46:14+05:30
రోడ్లను అడ్డంగా తవ్వేశాడు!
- మేడ్చల్ మండలం సోమారంలో రోడ్లు మూసివేత
- ఇబ్బందుల్లో ప్రజలు, పరిశ్రమల నిర్వాహకులు
- ఫిర్యాదు చేసినా తీరని సమస్య
మేడ్చల్: మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ప్రజలు, పరిశ్రమల యాజమాన్యాల సౌకర్యార్థం వదిలేసిన రోడ్లను ఓ వ్యక్తి మూసివేయడంతో ఇటు ప్రజలు అటు పరిశ్రమల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు గ్రామ కార్యదర్శి నుంచి ఎంపీవో, ఎంపీడీవో, డీపీవో, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. అయినా సమస్య పరిష్కారానికి నోచడం లేదు. సోమారం గ్రామం నుంచి సమీపంలో గల పరిశ్రమలకు భూములున్న వారు 40 అడుగుల రోడ్డును వదిలి పరిశ్రమల నిర్వాహకులకు భూములను అమ్మేశారు. రోడ్డుకు వదిలిన స్థలాన్ని గ్రామపంచాయతీకి గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు డాక్యుమెంట్లలో ఈ రోడ్డును చూపించే హెచ్‌ఎండీఏ, టీఎ్‌సఐపాస్, గ్రామపంచాయతీల నుంచి అన్ని అనుమతులు పొంది పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సదరు వ్యక్తి తాను గ్రామపంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేసిన స్థలం ఇది కాదని రోడ్డు మధ్యలో కడీలు పాతాడు. మరోచోట ఏకంగా జేసీబీతో రోడ్డును అడ్డంగా తవ్వేశాడు. దీంతో పరిశ్రమల నిర్వాహకులతో పాటు పరిశ్రమలకు వెళ్లే గ్రామస్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ఇదే సమస్య నెలకొంది. ఇటు అధికారులు అటు పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
నోటీసు ఇచ్చాం - బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి
రోడ్డును మూసివేసిన వ్యక్తికి నోటీసు ఇచ్చాం. రోడ్డుకు వదిలి న స్థలం వేరే సర్వే నంబర్‌లో ఉందని సదరు వ్యక్తి తిరిగి వివరణ కూడా ఇచ్చారు. సమస్య టీఎస్ ఐపాస్ కార్యాలయానికి వెళ్లింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
అధికారులకు ఫిర్యాదు చేశాం - నాగేందర్, సోమారం గ్రామస్థుడు
సోమారంలో మూసివేసిన రోడ్లను తెరిపించాలని అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇంత వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. రోడ్డు మూసివేయడంతో ప్రజలు, పరిశ్రమల నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి కడీలను తొలగించాలి.
Updated Date - 2020-12-28T05:46:14+05:30 IST