వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
ABN, First Publish Date - 2020-12-12T04:51:01+05:30
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
- పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
కడ్తాల్ : కడ్తాల గ్రామ పంచాయతీ పరిధిలోని గొర్లకుంట తండా తుల్జాభవాని ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడు రోజుల వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో అలంకరించారు. వేడుకలకు గొర్లకుంట తండాతో పాటు సమీప గ్రామాలు, తండాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ప్రముఖ అర్చకుడు మెళ్లూరి వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, మోహన్‌ల ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మండపారాధన, హోమం, యంత్ర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీక్యానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాట నర్సింహ, నాయకులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు మాదారం శేఖర్‌గౌడ్, నరేశ్‌నాయక్, గూడూరు భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనునాయక్, మోహన్, రవి, దేవుజా, బీక్యానాయక్, నరేందర్‌రెడ్డి, మాలే మల్లేశ్‌గౌడ్, అశోక్, చందోజీ పాల్గొన్నారు.
భక్తిమార్గాన్ని అలవర్చుకోవాలి
లోకశాంతి కోసం ప్రజలంతా భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తుల్జాభవాని దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీని సత్కరించారు.
Updated Date - 2020-12-12T04:51:01+05:30 IST