నిమ్స్‌లో ఓపీ జోరు
ABN, First Publish Date - 2020-09-14T08:56:46+05:30
నిమ్స్‌లో మెల్లమెల్లగా వైద్య సేవలు పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకూ నిమ్స్‌కు రావాలంటేనే భయపడిన రోగులు.. ఇప్పుడు చికిత్స కోసం వస్తున్నారు. కరోనా లేకముందు అన్ని విభాగాల్లో
- పుంజుకుంటున్న వైద్య సేవలు
- కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థో విభాగాలకు పెరిగిన రోగులు
- సేవలు పెంచడంపై వైద్యాధికారుల దృష్టి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో మెల్లమెల్లగా వైద్య సేవలు పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకూ నిమ్స్‌కు రావాలంటేనే భయపడిన రోగులు.. ఇప్పుడు చికిత్స కోసం వస్తున్నారు. కరోనా లేకముందు అన్ని విభాగాల్లో కలిపి 2 వేల మంది దాకా అవుట్ పేషెంట్లు వచ్చేవారు. వైరస్ భయంతో ఆ సంఖ్య 200కు పడిపోయింది. మళ్లీ క్రమంగా పెరిగి 400 దాటింది. ముఖ్యంగా.. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో, న్యూరాలజీ విభాగాలు బాగా పుంజుకుంటున్నాయి. జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ విభాగాల్లో రోగుల సంఖ్య 50ు మేర పెరిగింది. కార్డియాలజీ విభాగంలో 30 శాతం.. ఆర్థో విభాగంలో 60 శాతం మేరకు రోగులు వస్తున్నారు. గతంతో పోలిస్తే ఆర్థో సర్జరీలు 50 శాతం దాకా జరుగుతున్నాయి. ఆర్థోకు సంబంధించిన వార్డుల్లో కొన్ని పడకలు రోగులతో నిండిపోయి ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవి కాక, మిగతా విభాగాలకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది.
పటిష్ఠ చర్యలు..
ఓపీ సంఖ్యను మరింత పెంచేందుకు నిమ్స్ వైద్యాధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు నిమ్స్‌కు వచ్చిన ఓపీ రోగులకు థర్మల్ స్ర్కినింగ్ నిర్వహించి, ఎవరికైనా జ్వరం ఉంటే మరో ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించే వారు. కానీ సోమవారం నుంచి ఓపీ విభాగాల్లో థర్మల్ స్ర్కీనింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగులకు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించి.. ఫలితాల ఆధారంగా ఇతర వైద్య సేవలను అందించనున్నారు. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వచ్చినవారిని కొవిడ్ ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నారు. నెగెటివ్ వచ్చి, లక్షణాల్లేనివారికి నిమ్స్‌లోనే అవసరమైన వైద్య సేవలు, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. జ్వరం, జలుబు, ఇతర అనారోగ సమస్యలున్న ప్రతి ఒక్కరినీ వెనకకు పంపించకుండా చికిత్సలు అందించడం వల్ల సోమవారం నుంచి ఓపీ పేషెంట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
భయపడుతున్నారని..
నిమ్స్‌లో వైద్య సిబ్బందికి కరోనా చికిత్సలు అందిస్తుండడంతో కొందరు రోగులు చికిత్స చేయించుకోవడానికి భయపడుతున్నారు. కొంత మంది రోగులు ఫోన్లు, వీడియో కాల్ ద్వారా వైద్యుల సలహా తీసుకుంటున్నారు. ఫాలో అప్ కేసులకు సంబంధించిన రోగులు కూడా కొద్ది మందే వస్తున్నారు. దీంతో కరోనా చికిత్స అందించే బ్లాక్‌ను ఇతర బ్లాక్‌లతో సంబంధం లేకుండా, రోగుల రాకపోకలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. కొంత మంది రోగులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఓపీకి వచ్చినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను బయట చేయించుకుంటున్నారు. అందువల్ల ఓపీ పేషంట్లు నిమ్స్‌లోనే టెస్టులు చే యించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Updated Date - 2020-09-14T08:56:46+05:30 IST