సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు జీతం
ABN, First Publish Date - 2020-11-03T07:15:02+05:30
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద బాధితులను ఆదుకోవడానికి వీలుగా ఉద్యోగుల ఒక రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
హైదరాబాద్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద బాధితులను ఆదుకోవడానికి వీలుగా ఉద్యోగుల ఒక రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి మళ్లించారు. ఈ మేరకు సోమవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల మూల వేతనం నుంచి నవంబరు మాసానికి సంబంధించి ఒక్కరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి మళ్లించనున్నారు.
అంగీకారం లేకుండా వద్దు: ఉద్యోగుల వేదిక
ఒకరోజు వేతనాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు మళ్లిస్తూ జీవో ఇవ్వటాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. తమ అంగీకారం లేకుండా వేతనాల్లో కోత విధించవద్దని ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ సంపత్ కుమారస్వామి, జి. బాలస్వామి, పి.నిర్మల, తాజ్‌మోహన్ రెడ్డి, కె. జంగయ్య, చావ రవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యోగులు అందరికీ ప్రాతినిధ్యం వహించే సంఘం గానీ జేఏసీ గానీ రాష్ట్రంలో ఏదీ లేదని స్పష్టం చేశారు. జేఏసీ పేరుతో ఐక్యవేదిక భాగస్వామ్య సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఇచ్చిన విరాళం ప్రకటన లేఖ ఆధారంగా ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడానికి వీల్లేదన్నారు.
Updated Date - 2020-11-03T07:15:02+05:30 IST