కరువు నేలలో చిగురిస్తున్న ఆశలు
ABN, First Publish Date - 2020-05-29T10:07:59+05:30
నదీజలాలు లేక, వరుస కరువు, వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న యాదాద్రి, నల్లగొండ జిల్లా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని బీడుభూములకు అందనున్న గోదావరి జలాలు
కాళేశ్వరంలో తరువాయి బస్వాపూర్ రిజర్వాయర్‌కే నీరు
యాదాద్రి, మే 27(ఆంధ్రజ్యోతి): నదీజలాలు లేక, వరుస కరువు, వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న యాదాద్రి, నల్లగొండ జిల్లా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. గోదావరి జలాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని చివరి దశకు కొద్ది రోజుల్లో సాగునీరు అందుతుందని అంతా భావిస్తున్నారు. గోదావరి జలాలను రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్, రంగనాయకులసాగర్‌కు జలకళ సంతరించింది. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు గోదావరిని పరుగులు పెట్టించేందుకు శుక్రవారం ముహూర్తంగా నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తుండటంతో మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించే హైలెవల్ మెయిన్ కెనాల్ మరో పాయ ద్వారా యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు చేరనున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీరు చేరాక తరువాయి యాదాద్రి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్‌దే అని ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణం, కాల్వల తవ్వకాల పనులు శరవేగంగా సాగుతుండటంతో వచ్చే యాసంగి నాటికి గోదావరి జలాలు అందుతాయని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల రైతులు ఆశిస్తున్నారు.
2.85లక్షల ఎకరాల ఆయకట్టు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో 2.85లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా ప్రతిపాదించారు. 15, 16 ప్యాకేజీల కింద చేపట్టిన పనుల ద్వారా యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, వలిగొండ, నారాయణపూర్ మండలాలు, నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 15వ ప్యాకేజీలో యాదాద్రి జిల్లాలో 63,500 ఎకరాలకు, 16వ ప్యాకేజీలో 1లక్ష 88వేల 500 ఎకరాలకు సాగు నీరు అందనుంది. పంట పొలాలకు నీరు చేరవేసేందుకు డిస్ట్రిబ్యూటరీ కాల్వలతోపాటు చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపేందుకు ఫీడర్ చానల్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
గోదావరి నదిపై మేడిగడ్డ నుంచి లిఫ్ట్‌ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ దశల్లో మల్లన్నసాగర్‌కు జలాలు చేరుకుంటున్నాయి. మల్లన్నసాగర్ నుంచి దిగువన ఉన్న గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు గ్రావిటీ ద్వారా నీరు అందనుంది. మల్లన్నసాగర్ నుంచి దిగువకు జలాలు మళ్లించే పాయ ద్వారానే అటు కొండపోచమ్మ, ఇటు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీరు అందుతుంది. మల్లన్నసాగర్ నుంచి దిగువ హైలెవల్ మెయిన్ కాల్వపై కొండకండ్ల నుంచి యాదాద్రి జిల్లాకు 15వ ప్యాకేజీలో భాగంగా గ్రావిటీ ద్వారా నీటి మళ్లింపు జరగనుంది. ప్రస్తుతం కొండపోచమ్మకు నీటి విడుదల చేస్తుండటంతో అదే పాయ మళ్లింపు ద్వారా యాదాద్రి జిల్లాకు కొద్దిరోజుల్లో జలసిరి రానున్నదని భావిస్తున్నారు.
బస్వాపూర్ సిద్ధం, గంధమల్లపై సందిగ్ధం
నదీజలాల సదుపాయం లేని యాదాద్రితోపాటు నల్లగొండ జిల్లాలోని కరువునేలను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15, 16 ప్యాకేజీలను ప్రతిపాదించారు. 15వ ప్యాకేజీలో తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద ప్రతిపాదించిన రిజర్వాయర్ బాలారిష్టాలను ఎదుర్కోంటోంది. 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపూర్ వద్ద ప్రతిపాదించిన 11.39 టీఎంసీల సామర్ధ్యమున్న రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాథమికంగా 1.50 టీఎంసీల నీటి నిల్వలకు నిర్మాణం పూర్తి కాగా, మొత్తంగా 40శాతం పనులు జరిగాయి. గంధమల్ల రిజర్వాయర్‌ను 9.89 టీఎంసీల సామర్ధ్యంతో తొలుత ప్రతిపాదించిన ప్రభుత్వం తర్వాత దాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. ఈమేరకు భూసేకరణ పనులు కూడా సాగకపోవడంతో నిర్మాణం జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది.
ఈ రెండు ప్యాకేజీల్లో మాత్రం హైలెవల్ మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులు మాత్రం సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదిత అన్నీ ప్యాకేజీల పనులు తుదిదశకు చేరుకోవడంతో యాదాద్రి జిల్లాలో మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు హైలెవల్ మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కాల్వలతో బస్వాపూర్ రిజర్వాయర్ పనులు తుది దశకు చేరాయి.
1.50 టీఎంసీల నీటి నిల్వకు సిద్ధం
గజ్వేల్ జిల్లా కొడకండ్ల వద్ద 15వ ప్యాకేజీ నుంచి 40.1 కిలోమీటర్ల హైలెవల్ ప్రధాన కాల్వ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పంట పొలాలకు నీరందించడంతోపాటు చెరువులు, కుంటలను నింపేందుకు డిస్ట్రిబ్యూరీ కాల్వల తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి, నల్లగొండ జిల్లాలకు సాగునీటిని, హైదరాబాద్ జిల్లాలకు తాగునీటిని అందించే భువనగిరి మండలం బస్వాపూర్ రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ నుంచి నీటిని మళ్లించి, ప్రస్తుతానికి 1.50 టీఎంసీలు నిల్వ చేసేలా పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా 1.50 టీఎంసీల నీటిని బస్వాపూర్ రిజర్వాయర్‌లో నిల్వ చేసేందుకు సిద్ధం చేసినట్టు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్లు చెబుతున్నారు.
బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటి మళ్లింపుతో పాటు మరో 10 చెరువులను నింపేందుకు కూడా పనులు పూర్తి చేసిన అధికారులు ప్రతిపాదిత ఆయకట్టు లక్ష్యం మేరకు డిస్టి్ట్రబ్యూటరీ కాల్వ పనులపై దృష్టి సారించారు. కాల్వల నిర్మాణానికి అవసరమైన మరో 750 ఎకరాల భూసేకరణలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. జూలై నాటికి బస్వాపూర్ రిజర్వాయర్‌కు 1 టీఎంసీ నుంచి 1.50 టీఎంసీల నీటిని మళ్లించడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా చెరువులు, కుంటలను నింపి వచ్చే యాసంగి నాటికి పంటపొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని కాళేశ్వరం ఇంజనీర్లు తెలిపారు.
Updated Date - 2020-05-29T10:07:59+05:30 IST