విదేశాలకు వెళ్లొచ్చినవారు హోంక్వారంటైన్
ABN, First Publish Date - 2020-03-27T11:27:27+05:30
విదేశాలకు వెళ్లొచ్చిన వారితోపాటు, ఎన్‌ఎఆర్‌ఐలకు హోంక్వారంటైన్ కొనసాగుతోంది.
దేవరకొండ, నల్లగొండ అర్బన్, కేతేపల్లి, కనగల్, ఆలే రు, మార్చి26: విదేశాలకు వెళ్లొచ్చిన వారితోపాటు, ఎన్‌ఎఆర్‌ఐలకు హోంక్వారంటైన్ కొనసాగుతోంది. వారికి ప్రతి రోజు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలానికి చెందిన ఇద్దరు యువకులు గురువారం అస్వస్థతకు గురవగా మెరుగైన వైద్యానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దు బయ్ నుంచి ఓ యువకుడు ఈ నెల 13న హైదరాబాద్‌కు వచ్చి అక్కడ ఉంటున్న తమ్ముడుతో కలిసి ఈ నెల 20న నేరేడుగొమ్ము మండలంలోని తన స్వగ్రామానికి వచ్చాడు. గురువారం అన్నదమ్ములిద్దరూ అస్వస్థతకు గురవగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా వారిని హైదరాబాద్‌కు తరలించారు.
నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందనే వార్త గురువారం కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఐదు రోజుల క్రితం ముంబాయి నుంచి అప్పాజిపేటకు వచ్చాడు. ఆతర్వాత బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడు. ఆ తర్వాత రోజు నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతుండగా, రాములబండ పీహెచ్‌సీకి వెళ్లగా, వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన అతడ వైద్య పరీక్షలకు భయపడి పారిపోయి తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వారు అతడిని నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వైరల్ ఫీవర్ మాత్రమేనని, కరోనా లక్షణాలు లేవని తేల్చిచెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్‌ఆర్‌ఐలకు కొనసాగుతున్న పరీక్షలు
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 352 మంది విదేశాల నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అందులో 130 మం ది క్వారంటైన్ పీరియడ్ ముగియగా, మరో 180 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మరో 42 మంది వేరే జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు సమాచారం. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు విదేశీయుల సమాచారాన్ని సేకరించి వారికి క్వారంటైన్ పీరియడ్‌ను పరిశీలిస్తోంది. అనుమానం ఉన్న వారి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ స్టాంపింగ్ వేస్తున్నారు. క్వా రంటైన్ పీరియడ్ ముగియకుండా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని సూచించారు.
నిబంధనలు పాటించకుండా బయట తిరిగితే వారిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కనగల్ మండలంలోని రేగట్టే, దర్వేశీపురం, తొరగల్, పగడిమర్రి గ్రామాల్లో ఒక్కొక్కరు, ఎస్‌లింగోటంలో ఇద్దరు చొప్పున ఇటీవల విదేశీ ప్రయాణాలు ముగించుకుని గ్రామాలకు వచ్చారు. వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. వీరు 14 రోజుల పాటు ఇతరులతో కలవకుండా హోంకార్వంటైన్‌లో ఉండాలని వైద్యులు ఆదేశించారు. అదేవిధం గా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సుమారు 50 మంది ఉన్నారు. నల్లగొండ మండల పరిధిలో ఆరోగ్య సిబ్బందికి వచ్చిన జాబితా ప్రకారంగా 10 మంది విదేశాల నుంచి వచ్చినట్లు వారిని వైద్య పరీక్షలు నిర్వహించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు రాములబండ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. అందులో 14 రోజులు దాటిన వారు ఏడుగురు ఉన్నారని, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు.
కేతేపల్లి మండలానికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన పలువురిని హోం క్వారంటైన్‌లో గడపాలని కేతేపల్లి ఎంపీపీ పి.శేఖర్, మండల వైద్యాధికారి విజయకుమార్, ఎంపీడీవో యాకూబ్‌నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు కోరారు. కాసనగోడు, గుడివాడ, కేతేపల్లికి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వీరిని కలిసి ఆరోగ్య జాగ్రత్తలపై తగిన సూచనలు చేశారు. యాదాద్రి జిల్లా ఆలేరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 35 మందిని ఐసోలేషన్ వార్డుకు వైద్యులు తరలించారు. అలాగే కొలనుపాక, గుండ్లగూడెం, బహద్దూర్‌పూట, శర్భణాపురం, గొలనుకొండకు చెందిన వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 103 మందిని ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.
Updated Date - 2020-03-27T11:27:27+05:30 IST