44 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
ABN, First Publish Date - 2020-05-22T09:58:48+05:30
జిల్లాలో భానుడు భగభగలు సృష్టిస్తున్నాడు. దీనికి వడగాడ్పులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం
మొదలైన వడగాడ్పులు
పెరిగిన ఏసీలు, కూలర్ల విక్రయాలు
జాగ్రత్తలు అనివార్యమంటున్న డాక్టర్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): జిల్లాలో భానుడు భగభగలు సృష్టిస్తున్నాడు. దీనికి వడగాడ్పులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం ఉదయం ఎనిమిదిగంటల నుంచే సూర్యభగవానుడు ప్రతాపం చూపించాడు. పదిరోజులుగా ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణీ కార్తె ప్రారంభానికిముందే ఇలా ఉంటే వచ్చే పదిరోజుల పరిస్థితి ఏంటోనని జనం ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు కరోనా భయంతో జనం ఇంటికే పరిమితం కాగా, భానుడి ప్రతాపంతో కాలు బయటపెట్టే పరిస్థితి లేదు.
నెల మొదటివారంలోనే 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ వచ్చాయి. ఓవైపు కరోనా, మరోవైపు భగ్గుమంటున్న ఎండలతో పేద, మధ్యతరగతి వర్గాలు, ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా ఎండల కారణంగా ఉదయం 11 గంటలు దాటితే జనం బయటికి రాలేకపోతున్నారు. 12 గంటలకే వీధుల్లో కర్ప్యూ వాతావరణం కనిపిస్తోంది. సహజంగా మే 3వ వారంలో ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం 44.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదుకాగా, మే చివరి నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 1న 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, 10న 43 డిగ్రీలకు చేరింది. ఈనెలలో సగటున 42 డిగ్రీలకు ఏనాడూ తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాలేదు.
మొదలైన వడగాడ్పులు
గురువారం ఉదయం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆదివారం వరకు వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
పెరిగిన కూలర్లు, ఏసీల విక్రయాలు
లాకడౌన్ ఆంక్షల సడలింపు, ఎండలు దంచికొడుతుండటంతో కూలర్లు, ఏసీల విక్రయాలు జోరందుకున్నాయి. ఎండతీవ్రత తట్టుకోలేక జనం వీటిని కొనుగోలు చేస్తున్నారు. రోజుకు 15కు తక్కువ కాకుండా కూలర్లు విక్రయిస్తున్నట్టు నల్లగొండ పట్టణంలోని ఓ ఎలకా్ట్రనిక్స్ దుకాణ యజమాని తెలిపారు.
ఎండా కాలంలో ప్రజలు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పౌష్టికాహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ కల్లుట్ల రవితేజారెడ్డి తెలిపారు. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి..
మసాలాలతో కూడిన పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు. మసాలాలు, ఉప్పు, నూనెలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. దీంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. అదేవిధంగా మాంసాహారానికి సైతం వేసవిలో దూరంగా ఉండటం మంచిది.
నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవాలి.
కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమోటా ముక్కలు, పెరుగుతో కలిపి సలాడ్లు మరీ మంచిది.
చాలా మంది అన్నం తినేందుకే ఇష్టపడుతుంటారు. వారు లెమన్ రైస్, కొత్తిమీర అన్నం, పుదీనా అన్నం, పాలక్‌రైస్ తీసుకుంటే మంచి పోషకాలు అందుతాయి. ఉదయం, సాయంత్రం చపాతీలు తీసుకోవచ్చు.
మాంసాహారులైతే శరీరంలోని ప్రొటీన్లు కోల్పోకుండా సాయంత్రం
వేళల్లో మసాలాలు లేని బేక్డ్, గ్రిల్డ్ చికెన్, మటన్ తీసుకోవడం మంచిది.
ప్రస్తుతం ఎక్కువగా దొరికే మామిడి, కర్బూజ, పైనాపిల్, బొప్పాయి తీసుకుంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి.
భోజనం చివరిలో పెరుగన్నం, లేదంటే మజ్జిగ తీసుకుంటే శరీరానికి సోడియం, పోటాషియం అంది నిస్సత్తువ దరిచేరదు.
ఎండల్లో ఎక్కువ పనిచేసే కూలీలు అన్నంతో పాటు మునగకాయ, పొట్లకాయ, క్యారెట్, ఆనపకాయ ఇలా అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి సాంబారు తీసుకోవడం మంచిది. ఇందులో పప్పు ఉండడం వల్ల ప్రోటీన్ల రూపంలో శక్తి అందుతుంది. చివరిలో మజ్జిగ తీసుకోవాలి. అల్లం, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
వేసవిలో ఎక్కువ సమయం పనిచేసేవారు 5-6 లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఉప్పు కలిపిన నిమ్మ రసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ తీసుకోవాలి.
కొవిడ్ నేపథ్యంలో శుచి, శుభ్రతతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో విటమిన్-సీ, డీ లతో పాటు జింక్ ఉండేలా చూసుకోవాలి.
ఎక్కడపడితే అక్కడ ఆహారం, జ్యూస్ తీసుకోకుండా ఇంట్లో స్వయంగా తయారు చేసుకుంటే మంచిది.
రెండు గంటలకు పైగా ఎండలో ఉంటే జ్వరమే
ఎండలతో ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు, నిత్యం ఎండలో నిలబడి పనిచేసే వారు ఇబ్బందులకు గురవుతారు. రెండు గంటలకు పైగా ఎండలో ఉంటే జ్వరం బారిన పడుతారు. శరీర ఉష్ణోగ్రత 104డిగ్రీలకు చేరుకుంటుంది. వెంటనే నీటితో శరీరాన్ని చల్లబర్చి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వేడి శరీరాన్ని చల్లబరచడానికి హృదయ కండర వ్యవస్ధ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని డాక్టర్ బీవీఎస్ ప్రసాద్ తెలిపారు. వేడిమితో అలసట, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువవుతాయని, చర్మ కేన్సర్ ప్రమాదం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత వరకు తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఎక్కువ నీరు, మజ్జిగా, ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవడం ద్వారా కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం
ఎంతటి ఆరోగ్యవంతులైనా ఈ ఎండ, వడగాలులు దెబ్బతీస్తాయి. వడదెబ్బకు గురైతే మొదట దెబ్బతినేది కిడ్నీ, ఆ తరువాత గుండె. పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే తెల్లటి దుస్తులు ధరించాలి. నల్లటి దుస్తులు అస్సలు వేసుకోకూడదు. చెవులు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్‌లా కట్టుకోవాలి. ప్రతిరోజు 5 లీటర్లకు తక్కువ కాకుండా మంచినీరు తాగాలి. దేశీయ పానీయాలు తాగాలి. తీవ్ర జర్వం, బీపీ పడిపోవడం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, మూత్రం నిలిచిపోవడం వంటి లక్షణాలు ఉంటే వడదెబ్బకు గురైనట్టుగా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి.
- డాక్టర్ మాతృ, జనరల్ ఫిజీషియన్, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రి
Updated Date - 2020-05-22T09:58:48+05:30 IST