మూసీ నీటి విడుదల షెడ్యూల్ రెడీ
ABN, First Publish Date - 2020-12-06T05:26:06+05:30
మూసీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో యాసంగి సాగుకు ఈనెల 18వ తేదీ నుంచి నీటి విడుదలకు అధికారులు షెడ్యూల్ రూపొందించారు.
ఈ నెల 18నుంచి యాసంగి సాగుకు!
మంత్రికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
కేతేపల్లి, డిసెంబరు 5: మూసీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో యాసంగి సాగుకు ఈనెల 18వ తేదీ నుంచి నీటి విడుదలకు అధికారులు షెడ్యూల్ రూపొందించారు. 645అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉండగా, యాసంగిపై రైతులు గంపెడాశతో నార్లు పోసి నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, నీటివిడుదల షెడ్యూల్‌ను రూపొందించిన అధికారులు తుది అనుమతుల కోసం ప్రతిపాదనలను మంత్రి జగదీ్‌షరెడ్డికి పంపారు. ఆయన అనుమతి రాగానే తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
నీటి విడుదల షెడ్యూల్ ఇలా..
ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని ఆయకట్టులో రైతులు ఆరుతడి పంటల సాగు చేసుకునేందుకు వీలుగా 100 రోజుల పాటు నాలుగు విడతల్లో వారబందీ విధానంలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి తొలి విడతగా 25రోజుల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 10రోజుల విరామం అనంతరం ఒక్కో తడికి 15రోజుల చొప్పున రెండు తడులకు నీటిని విడుదల చేస్తారు. చివరగా నాలుగో తడిని ప్రాజెక్టు నీటిమట్టం 617అడుగులకు చేరేవరకు కొనసాగించే అవకాశం ఉంది.
Updated Date - 2020-12-06T05:26:06+05:30 IST