అటవీ విస్తీర్ణం పెంచాలి
ABN, First Publish Date - 2020-12-19T05:48:46+05:30
నల్లమల అటవీ ప్రాంతంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లోకే్‌ష జైస్వాల్ తెలిపారు.
జంతు సంరక్షణకు ప్రత్యేక చర్యలు
అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్
దేవరకొండ డివిజన్‌లోని పర్యటన
చందంపేట, డిసెంబరు 18: నల్లమల అటవీ ప్రాంతంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లోకే్‌ష జైస్వాల్ తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోగల పాలపడ్యలో రూ.30లక్షల కంపా నిధులతో ఏర్పాటుచేసిన రోడ్డు, ఊట చెరువు, సోలార్ ప్లాంట్, చెక్‌డ్యాంలను అటవీ శాఖ తెలంగాణ ఫీల్డ్ డైరెక్టర్ ఏ.కె.సిన్హాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అటవీ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందులో భాగంగా అటవీప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నల్లమల అటవీప్రాంతంలో ఇప్పటికే బేస్ క్యాంపులు, వాచ్‌టవర్లు, వన్యప్రాణులు, అటవీ జంతువులకు నీటితొట్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, అటవీ జంతులు పెరుగుతున్నప్పటికీ వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ సంరక్షణకై ఖాళీగా ఉన్న సిబ్బంది భర్తీకి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. నల్లమలలో 25కు పైగా చిరుత పులులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అదే విధంగా పీఏపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొట్టాలగడ్డలో, నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారి శివర్ల రాంబాబు, నాగార్జునసాగర్ డివిజన్ అధికారి సర్వేశ్వర్, చందంపేట రేంజర్ రాజేందర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎ్‌ఫవో శ్రీనివా్‌సగౌడ్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
Updated Date - 2020-12-19T05:48:46+05:30 IST