వరద తగ్గుముఖం
ABN, First Publish Date - 2020-10-01T10:05:55+05:30
ఎగువ నుంచి నాగార్జునసాగర్‌కు వరద రాక తగ్గింది. బుధవారం సాగర్ 12క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ 12 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల
ఎగువ నుంచి 1,42,114 క్యూసెక్కుల వరద రాక
నాగార్జునసాగర్, సెప్టెంబరు 30: ఎగువ నుంచి నాగార్జునసాగర్‌కు వరద రాక తగ్గింది. బుధవారం సాగర్ 12క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,43,336 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 1,42,114 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0405 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు(311.7462 టీఎంసీలుగా) ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 5087, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,867 క్యూసెక్కులు, 12 క్రస్ట్ గేట్ల నుంచి 97,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 1,42,114 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి అంతే నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటి మట్టం 884.60 అడుగులుగా ఉంది. ఇది 213.4011 టీఎంసీలకు సమానం.
పులిచింతలకు కొననసాగుతున్న వరద
చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం ఎగువ నుంచి వరద కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 174.57(44.10టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,42,691 క్యూసెక్కుల నీరు వస్తుండగా; 99,915క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
డిండికి తగ్గిన వరద ప్రవాహం
డిండి: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు బుధవారం వరద ప్రవాహం తగ్గింది. ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్టనీటిమట్టం 36 అడుగుల(2.4టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది.
మూసీకి నిలకడగా ఇన్‌ఫ్లో
కేతేపల్లి: నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 645అడుగులు కాగా, ప్రస్తుతం 644అడుగులు ఉంది. ఎగువ నుంచి 2670క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2155క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ఒక క్రస్టు గేటు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
Updated Date - 2020-10-01T10:05:55+05:30 IST