పారిశ్రామిక కారిడార్ పేరుతో..అసైన్డ్ భూములకు ఎసరు
ABN, First Publish Date - 2020-10-04T10:12:42+05:30
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 60ఏళ్ల క్రితం నిరుపేదలు, దళితులకు ప్రభుత్వం సాగు భూములు కేటాయించింది. నాటి నుంచి వారంతా వరి, పత్తి సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1500 ఎకరాల గుర్తింపు
చిట్యాల మండలం వెల్మినేడులో 62ఎకరాల సేకరణ
ఆందోళన బాటలో పేద, దళిత రైతులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 60ఏళ్ల క్రితం నిరుపేదలు, దళితులకు ప్రభుత్వం సాగు భూములు కేటాయించింది. నాటి నుంచి వారంతా వరి, పత్తి సాగు చేసుకుంటున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి కూతవేటు దూరం లో ఉన్న ఈ భూములకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరా కోటి రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే పరిశ్రమ లు పెడుతున్నాం, ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తాం, ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ రెవెన్యూ అధికారులు ఇప్పటికే రెండుమార్లు నోటీసులు జారీ చేయగా, బాధిత రైతు లు ఆందోళనబాట పట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని యాదాద్రి, సూర్యాపేట ప్రధాన రహదారుల వెంట ఉన్న చౌటుప్పల్, చిట్యాల, చివ్వెంల మండలాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ సుమారు 1,500ఎకరాల భూమిని గుర్తించింది. కాలుష్యం పేరుతో హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లోని పరిశ్రమలు ను యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులోకి మార్చారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే పలు రకాల ఫార్మా కంపెనీలు ఉన్నాయి.
అవి వెదజల్లే హానికర ర సాయనాలతో సాగు, తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగునీటి బోరు వేస్తే విష రసాయానాలు ఉబికి వస్తున్నాయి. తాజాగా, కాలుష్య రహిత కంపెనీల పేరుతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ చర్లపల్లి సమీపంలోని దాదా పు 450 కాలుష్య రహిత కంపెనీలను నల్లగొండ జిల్లాకు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రైతుల ఆందోళన..
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో వేలాది మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం చెబుతున్నా విలువైన భూము లు ఇచ్చేందుకు పేదలు నిరాకరిస్తున్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 150మంది దళిత, నిరుపేద రైతుల నుంచి 62 ఎకరాల అసైన్డ్ భూమి సేకరణకు అధికారులు రెండుమార్లు నోటీసులు జారీ చేశారు. వెలిమినేడు శివారులో 418 సర్వేనంబరులో సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 62 ఎకరాలను భూమిలేని దళితులకు పంపిణీ చేశారు. ఆ భూమితోపాటు, సమీపంలోని 250ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామపంచాయతీ, మండల పరిషత్ సమావేశాల్లో తీర్మానాలు జరిగాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ముట్డడులూ జరిగాయి. నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పుతో బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
బడాబాబుల భూములు సేకరించాలి- నూనె వెంకటస్వామి, అఖిలపక్షం సమన్వయకర్త
జాతీయ రహదారి 65కు 200 మీటర్ల దూరంలో అసైన్డ్ భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ కోటి రూపాయల వరకు ఉంది. ఇంత విలువైన భూమిని సర్కారు కొనుగోలు చేయడం కం టే వెలిమినేడుకు 20కిలోమీటర్ల దూరంలో దండుమల్కాపురంలో 1800ఎకరాల ఎవాక్యు ప్రాపర్టీ భూము లు ఉన్నాయి, ఒకటే పట్టా. వెలిమినేడు పరిధిలోనే ఎర్రగుట్ట వద్ద 200ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రాంకీ వెంచర్ 2వేల ఎకరాల్లో ఉంది. అందులో 200 ఎకరాలు రెవెన్యూ శాఖకు స్వాధీనం చేశారు. పొ ల్యూషన్ లేదనుకుంటే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. సమీపంలోనే డేరా బాబా ఆఽధీనంలో 200ఎకరాలు ఉంది. ఆ సంస్థ అక్రమం. వీరందరినీ వదిలిపెట్టి పేదల భూములపై పడటం సరికాదు. ప్రభుత్వం ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే ప్రగతిభవన్ ముట్టడికి నిర్ణయించాం.
ఇచ్చిన భూమి తీసుకుంటే మా పరిస్థితి ఏంటి?- బొడ్డుపల్లి శ్రీను, అసైన్‌దారు
భూమి లేదని సర్కారుకు విన్నవించుకుంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు మా తండ్రికి సాగుభూమి కేటాయించారు. ఇప్పుడు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి, మాకు ఏ ఆధారం లేదు, ఇతర ప్రాంతాల్లో భూ సేకరణ చేసుకోండి, మా భూముల జోలికి రావొద్దు.
భూములు తీసుకుంటే రోడ్డున పడతాం- అరూరి మణెమ్మ, పట్టాదారు, వెలిమినేడు
పరిశ్రమల పేరుతో ప్రభుత్వం భూములు తీసుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే మేం రోడ్డున పడతాం. సర్కారు కేటాయించిన భూమిలోనే సాగుచేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాం. ప్రభుత్వం పునరాలోచ న చేయాలి. ఇదే జరిగితే మాకు సెంటు భూమి దక్కక కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది.
Updated Date - 2020-10-04T10:12:42+05:30 IST