ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు 12 రిజిస్ట్రేషన్లు
ABN, First Publish Date - 2020-11-03T10:27:28+05:30
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ప్రారంభమయ్యాయి. దేశంలోనే వినూత్న, పెద్ద పథకం కావడంతో మొదటి రోజు సహజంగా సాంకేతిక లోపాలు, సిబ్బందికి
నల్లగొండ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ ఆంధ్రజ్యోతి-యాదాద్రి):
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ప్రారంభమయ్యాయి. దేశంలోనే వినూత్న, పెద్ద పథకం కావడంతో మొదటి రోజు సహజంగా సాంకేతిక లోపాలు, సిబ్బందికి అవగాహన సమస్యలు ఎదురయ్యాయి. ఇబ్బందుల మధ్య విజయవంతంగా ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు 12 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రాబోయే వారం రోజుల్లో అన్ని సమస్యలను అధిగమిస్తామని రెవెన్యూ అధికారులు ధీమా వ్యక్తం చేస్తుండగా ధరణి ప్రక్రియ సులభంగా, ఉపయుక్తంగా ఉందని మొదటి రోజు ఆస్తుల క్రయ, విక్రయాలు చేసిన రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 71 మండలాల్లో వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ధరణి రిజిస్ట్రేషన్లను కలెక్టర్ అనితా రామచంద్రన్ లాంఛనంగా ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో తొలి రోజు మూడు రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, అందులో రెండు సేల్ డీడ్‌లు మరో రెండు గిఫ్ట్ డీడ్‌లు ఉన్నాయి. నల్లగొండ, నార్కట్‌పల్లి, పెద్దవూరలో రిజిస్ర్టేషన్లు జరిగాయి. నార్కట్‌పల్లిలో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా, మిగిలిన చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల రుసుము ముందుగానే చెల్లించినా పాస్ బుక్ ప్రింటింగ్‌కు మూడు గంటల సమయం పట్టింది. పెద్దవూరలో ఒక రిజిస్ట్రేషన్ కోసం సాయంత్రం మూడు గంటల వరకు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలకు మొదటి రోజు నాలుగు రిజిస్ట్రేషన్లు జరగ్గా ఏడుగురు స్లాట్లు బుక్ చేసుకున్నారు. నాగారం మండలంలో సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు జరగలేదు.
యాదాద్రి జిల్లాలోని 17 మండలాలకు తొలి రోజు ఐదు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వలిగొండ, నారాయణపూర్, అడ్డగూడూరు మండలాల్లో రిజిస్ట్రేషన్లు చేయగా, పాస్‌పుస్తకాల ప్రింటింగ్ మాత్రం జరగలేదు. ఇక్కడ డిజిటల్ సంతకం పెండింగ్ అని వస్తోంది. నల్లగొండలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. అడ్డగూడూరులో రిజిస్ట్రేషన్ ప్రక్రియను భువనగిరి ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. ధర్మయ్య అనే రైతు ఎకరం భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, పాస్‌బుక్ ప్రింటింగ్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.
స్లాట్ బుకింగ్‌కు సర్వర్ బిజీ
రిజిస్ట్రేషన్ కోసం మీ-సేవ కేంద్రాలకు వెళ్లిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. సర్వర్ బిజీ అని వస్తుండటంతో వారు పడిగాపులు కాయల్సి వచ్చింది. దేవరకొండ డివిజన్‌లో తొలిరోజు రిజిస్ట్రేషన్ స్లాట్ ఒక్కటి కూడా బుకింగ్ కాలేదు. కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో సాంకేతిక ఇబ్బందులతో సేవలు నిలిచిపోయాయి. మునుగోడు, నిడమనూరు, తిప్పరి, చిట్యాలలో స్లాట్లు బుక్ కాలేదు. మిర్యాలగూడ డివిజన్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్ బిజీతో రిజిస్ట్రేషన్లు లేక రైతులు పడిగాపులు కాశారు. సిబ్బంది అవగాహనా లోపంతోనే ఇక్కడ సమస్యలు ఎదురయ్యాయి. దాదాపు రెండు మాసాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో స్లాట్ బుకింగ్ కోసం మీ-సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద క్రయ, విక్రయదారులు నిరీక్షించారు. అదే విధంగా ధరణి వెబ్‌సైట్‌లో కొన్ని సర్వే నెంబర్ల నమోదులో తప్పుల కారణంగా స్లాట్ బుక్ కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో సమస్యలను అధిగమిస్తాం
ఏ పథకమైనా ప్రారంభంలో చిన్న, చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవే జిల్లాలో తొలి రోజు కనిపించాయి. వారం రోజుల్లో అన్ని సమస్యలను అధిగమించి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతాం. రైతుల రిజిస్ర్టేషన్ సులభంగా అవుతుంది. క్రయ, విక్రయాలు అన్నీ రికార్డుల్లో మార్పులు జరిగి, పాస్ బుక్‌లపై ప్రింటై వస్తుంది.
పీజే పాటిల్, నల్లగొండ జిల్లా కలెక్టర్
సీఎం ఆలోచన అద్భుతం
కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలన్న సీఎం ఆలోచన అద్భుతం. అంతకుముందు రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఒక రోజంతా పట్టేది. అలాంటిది, అవాంతరాలు లేకుండా అరగంటలోనే కొనుగోలు చేసిన భూమిని మా పాస్‌బుక్‌లో ఎక్కించి అమ్మిన వారి పాస్ బుక్ నుంచి తొలగించారు. వెంటనే పనిపూర్తికావడంతో ఆనందంగా ఉంది.
పెండెం రామకృష్ణ, పెద్దసూరారం
Updated Date - 2020-11-03T10:27:28+05:30 IST