టన్నులు కొనేశారు!
ABN, First Publish Date - 2020-06-08T09:52:33+05:30
మృగశిర కార్తెను పురస్కరించుకొని నగరంలోని అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు ఆదివారం కొనుగోలుదారులు పోటెత్తారు.
- ముషీరాబాద్‌లో భారీగా చేపల అమ్మకాలు.. కొర్రమీను రూ.600, బొచ్చె రూ .180
ముషీరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తెను పురస్కరించుకొని నగరంలోని అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు ఆదివారం కొనుగోలుదారులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో మార్కెట్ కిక్కిరిసిపోయింది. అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం కొనసాగింది. సోమవారం మృగశిర కార్తె ఆరంభం కానుండడం, ఆదివారం కలిసి రావడంతో చేపల కోసం కొనుగోలుదారులు పోటెత్తారు. దీంతో మార్కెట్ కిక్కిరిసిపోయింది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం కాని, మాస్కులు ధరించడం కాని చేయలేదు. కరోనా వైరస్ ప్రబలంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్‌కు ఇలా వేలాదిగా తరలిరావడం, కిక్కిరిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మృగశిర కార్తె సందర్భంగా వ్యాపారులు తెలుగు రాష్ర్టాల నుంచి వంద టన్నుల చేపలను దిగుమతి చేసుకోగా, అవి పూర్తిగా అమ్ముడు పోయాయని హోల్‌సేల్ వ్యాపారి గణేష్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కొర్ర మీను రూ.600లకు, బొచ్చె చేప పెద్దసైజు కిలో రూ 180, చిన్న సైజు రూ.140-150లకు, రవ్వు రూ.110 నుంచి 120లకు విక్రయించారు. కాగా, మార్కెట్‌లో చేపలను కొనడం సులువైనప్పటికీ వాటిని శుభ్రం చేసి ముక్కలు చేయించేందుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. బారులు తీరి చేపలను ముక్కలు చేయించుకున్నారు. ముక్కలు చేయడానికి సాధారణ రోజుల్లో కిలో రూ 20 వసూలు చేయగా ఆదివారం కిలో రూ.30 నుంచి 40 వసూలు చేశారు.
Updated Date - 2020-06-08T09:52:33+05:30 IST