ఆస్పత్రులపై ఫిర్యాదుకు 104
ABN, First Publish Date - 2020-10-01T08:36:13+05:30
ఆరోగ్యశ్రీని బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలను అరికట్టేందుకు కమిటీ వేసి నివేదిక అందించాలని....
‘ఆరోగ్యశ్రీ’ చికిత్స నిరాకరిస్తే చర్యలు
అందరితో సమానంగా చికిత్స చేయాలి
పరిశీలనకు నిఘా బృందాల ఏర్పాటు
ఆరోగ్యశ్రీ అవకతవకలపై నివేదికివ్వండి
మోసం చేసే ఆస్పత్రులపై ఉక్కుపాదం
ప్యానెల్ జాబితా నుంచి తొలగించండి
సమీక్షలో మంత్రి ఈటల ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీని బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలను అరికట్టేందుకు కమిటీ వేసి నివేదిక అందించాలని, మో సాలకు పాల్పడే ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. పాత పద్ధతులను పక్కనపెట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విధివిధానాలు తయారు చేయాలని సూచించారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలని, వివిధ జబ్బులకు చెల్లిస్తున్న డబ్బులు, చికిత్స విధానాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఏ దైనా ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందించడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకోవాలన్నా రు. అటువంటి ఆస్పత్రుల మీద ఫిర్యాదు చేయడానికి 104కి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యశ్రీ వార్డు అంటూ విభజించకుండా మిగిలిన రోగుల తో పాటే చికిత్స అందించేలా చూడాలని అధికారులను కోరారు.
రోగుల అభిప్రాయాలు తీసుకొని, సరిగా చికిత్స అందించని ఆస్పత్రిని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డులకు అన్ని ఆస్పత్రుల్లో, వైద్య సేవలన్నీ అందేలా చూస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం 100 రెట్లు మెరుగైనదన్నారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌కు కొత్త ఆస్పత్రులు
ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్య మరింత పెరగనుంది. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ జాబితాలో 323 ఆస్పత్రులు ఉన్నాయి. ఆ పథకం కింద 986 రకాల చికిత్సలు అందిస్తున్నారు. రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లోకి కొత్తగా ఏ ఆస్పత్రికీ అవకాశం ఇవ్వలేదు. తాజాగా మరో 15 ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా అవకాశం!
ప్రస్తుతం ఉన్న 323 ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాల్లో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో చాలా తక్కువగా నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. కొత్తగా ఎంప్యానెల్‌కు అవకాశం ఇస్తే ప్రస్తుతం ఎక్కువగా ఉన్న జిల్లాల నుంచే మళ్లీ దరఖాస్తులు వస్తాయనే ఉద్దేశంతో గత రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ వాటి జోలికే వెళ్లలేదు. కానీ, ఆరోగ్యశ్రీలోని ఉన్నతాధికారులు మాత్రం గత రెండేళ్లలో 15 ఆస్పత్రులను ఎంప్యానెల్‌లో చేర్చారు. ఇవన్నీ దొడ్దిదారినే అనుమతులు తెచ్చుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Updated Date - 2020-10-01T08:36:13+05:30 IST