ఓవరాక్షన్‌తోనే ఉద్యోగాలు పోయాయ్
ABN, First Publish Date - 2020-09-14T08:59:11+05:30
ఫీల్డ్ అసిస్టెంట్ల ఓవరాక్షన్ వల్లే ఉద్యోగాలు పోయాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
- ఫీల్డ్ అసిస్టెంట్లతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి
- ఫీల్డ్ అసిస్టెంట్లతో మంత్రి ఎర్రబెల్లి
పర్వతగిరి/మహబూబాబాద్, సెప్టెంబరు 13: ఫీల్డ్ అసిస్టెంట్ల ఓవరాక్షన్ వల్లే ఉద్యోగాలు పోయాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం పలు గ్రామాలకు చెందిన సుమారు 150 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో ఎర్రబెల్లిని కలిశారు. ప్రభుత్వం ఉద్యోగాలను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మృతి చెందారని తెలిపారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె విరమిస్తే సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పినా పట్టించుకోలేదని, ఓవరాక్షన్ వల్లే ఉద్యోగాలను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎఫ్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి మాట్లాడుతూ సమ్మెను విరమిస్తే విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి ప్రస్తుతం మాట మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు సమష్టిగా పని చేసి పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండల కేంద్రంలో ఆదివారం టీఆర్‌ఎస్ శ్రేణులతో మంత్రి దయాకర్‌రావు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
Updated Date - 2020-09-14T08:59:11+05:30 IST