రేషన్ బియ్యం పంపిణీకి మూడు ఆప్షన్లు
ABN, First Publish Date - 2020-10-03T10:12:51+05:30
రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తీసుకునేందుకు లబ్ధిదారులకు సర్కారు మూడు రకాల అవకాశాలను కల్పించింది.
మొబైల్ ఓటీపీ, ఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా తీసుకునే అవకాశం
థర్డ్ పార్టీ అథెంటికేషన్ లేకుండానే పంపిణీ
వీఆర్వో వ్యవస్థ రద్దుతో సర్కారు నిర్ణయం
మెదక్ అర్బన్, అక్టోబరు 2 : రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తీసుకునేందుకు లబ్ధిదారులకు సర్కారు మూడు రకాల అవకాశాలను కల్పించింది. థర్డ్ పార్టీ అథెంటికేషన్ లేకుండానే రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రేషన్ సరుకులను మూడు రకాలుగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన బియ్యం లబ్ధిదారులకు ఓటీపీ, ఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా అందించాలని సూచించారు. వేలిముద్ర పడని చోట ఐరిస్, ఇది రానిచోట మొబైల్ ఓటీపీ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే అవకాశం కల్పించినందున రేషన్ కార్డుతో లింకైన ఫోన్ నంబర్‌ను షాపు దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ ఆధార్‌తో తప్పకుండా లింకై ఉండాలి. ఆధార్‌తో లింకు కాకుంటే అందుబాటులో ఉన్న ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐరిస్ ద్వారా బియ్యం తీసుకునేందుకు అవకాశం ఉన్నందున మిషన్‌లు సక్రమంగా పని చేసేలా చర్యలు చేపట్టాలని ఐరిస్ ఇంజనీర్లను, రేషన్ డీలర్లను అధికారులు ఆదేశించారు. ఫింగర్ ఫ్రింట్ ద్వారా సరుకులు తీసుకునే అవకాశమున్నందున బియ్యం తీసుకునే ముందు, తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 8.73 లక్షల కార్డుదారులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,73,926 రేషన్‌కార్డులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 2,13,377 కార్డుదారులు, సంగారెడ్డి జిల్లాలో 3,72,519, సిద్దిపేట జిల్లాలో 2,88,034 రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. వీరందరికీ జిల్లాలోని ఆయా రేషన్ షాపుల్లోని ఈ-పాస్ ద్వారా బియ్య పంపిణీ జరుగుతుంది. అయితే ఈ-పా్‌సలో వేలిముద్రలు రాని వారికి పాత పద్ధతిలో పంపిణీ చేసేవారు. కార్డుదారుడి పేరు లిస్టులో లేని వారికి, నెల కోటా అలాట్‌మెంట్ లిస్టులో పేర్లు లేని వారికి వీఆర్వో, వీఆర్‌ఏ అఽథెంటికేషన్ ద్వారా బియ్యం అందజేసేవారు. ప్రస్తుతం వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో థర్డ్ పార్టీ అథెంటికేషన్ లేకుండా పంపిణీ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేసింది.
Updated Date - 2020-10-03T10:12:51+05:30 IST