పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
ABN, First Publish Date - 2020-03-16T07:34:18+05:30
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.
19 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహణ
జిల్లాలో 66 కేంద్రాలు ఏర్పాటు
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 11,471 మంది
ముగ్గురు ఫ్లయింగ్, 18 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లతో పర్వవేక్షణ
మెదక్ అర్బన్, మార్చి 15 : పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. 19 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు ఆయా మండలాల పోలీ్‌సస్టేషన్లకు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్షలు జరుగనున్నాయి.
66 పరీక్ష కేంద్రాలు
ఎగ్జామ్స్ నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో మొత్తం 11,471 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా ఇందులో బాలురు 5,717, బాలికలు 5,754 మంది ఉన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరుగునున్నాయి. హిందీ పరీక్ష మాత్రం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది.
నిరంతరం పర్యవేక్షణ
పది పరీక్షలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఫ్లయింగ్, 18 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, 800 మంది ఇన్విజిలేటర్లు, 30 మంది రూట్ ఆఫీసర్లు, 30 మంది జాయింట్ కస్టోడియన్లు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి వసతి కల్పించారు. వార్షిక పరీక్షల సమయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఉన్నతాధికారులు ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల హాల్‌టికెట్స్ ఇప్పటికే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
కట్టుదిట్టమైన చర్యలు
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఏ ఒక్కరు కేంద్రంలో ప్రాంగణంలో కానీ.. గోడ దూకడం కానీ చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. పరీక్షల సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసేయాలని సూచించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం.. రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాధికారి, మెదక్
పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నిఏర్పాట్లు పూర్తిచేశాం. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం.
Updated Date - 2020-03-16T07:34:18+05:30 IST