జోరుగా మట్టి దందా
ABN, First Publish Date - 2020-11-13T10:00:46+05:30
మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రికి రాత్రే వందలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకుల అండతో అక్రమ దందా పూడు పువ్వులు..
మనోహరాబాద్ మండలంలో అక్రమంగా తవ్వకాలు
అధికార పార్టీ నేతలదే ప్రధాన పాత్ర
అడ్డుకున్న వీఆర్‌ఏలపై తిట్ల పురాణం
ఆ మూడు గ్రామాల్లో ప్రతీ రోజు ఇదే తంతు
మనోహరాబాద్, నవంబరు 12: మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రికి రాత్రే వందలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకుల అండతో అక్రమ దందా పూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగుతున్నది. అధికారులెవరూ ఇటువైపు చూసేందుకు జంకుతుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన వీఆర్‌ఏలు, స్థానికులపై అక్రమార్కులు దౌర్జణ్యానికి దిగుతున్నారు. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కూచారం, దండుపల్లి, కాళ్లకల్ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, టీఎ్‌సఐఐసీకి చెందిన భూముల్లో యథేచ్చగా మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రి గుట్టలను పిండి చేస్తున్నారు. ఎత్తైన కొండలు సైతం నెలల వ్యవధిలోనే మైదానాలను తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా కూచారం గ్రామంలో మట్టి తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముప్పిరెడ్డిపల్లిలో ప్రతీ రోజు వందలాది లారీల మట్టి తరలిపోతున్నది. దండుపల్లిలోనూ ఇదే తంతు కొనసాగుతున్నది.
తరలించిన మట్టితో ఎఫ్‌టీఎల్ చదును
ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డుకు సమీపంలో ఓ గోదాం నిర్మిణంలో ఉంది. ఇందుకోసం భూమి ఎత్తు పెంచేందుకు ఇప్పటికే వందాలది లారీల మట్టిని ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో డంప్ చేశారు. గోదాం చుట్టూ ఉన్న ప్రాంతం ఎత్తు పెంచేందుకు ముంగళవారం రాత్రి పదుల సంఖ్యలో లారీలతో మట్టిని పోశారు. ఈ తతంగంపై స్థానికులు సమాచారమిచ్చినా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. గ్రామస్థులే ముందుకువచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా వ్యాపారులు బెదురకుండా మట్టి తరలింపును యథేచ్ఛగా కొనసాగించారు.
తహసీల్దార్‌కు వీఆర్‌ఏల ఫిర్యాదు
మట్టి తరలింపును అడ్డుకున్నందుకు కొందరు తమపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారని ముప్పిరెడ్డిపల్లి వీఆర్‌ఏలు గురువారం తహాసీల్దార్ కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి గ్రామంలో టీఎ్‌సఐఐసీ భూముల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో తాము వెళ్లామని. అనుమతులు లేకుండా మట్టి తవ్వడం ఏమిటని అడిగితే దూషించారని వారు తహాసీల్దార్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన తహాసీల్దార్ ఎస్సై రాజుతో కలిసి ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామాల్లో పర్యటించారు. మట్టి తవ్వకాలు జరిగిన ప్రదేశాలను సందర్శించారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్నరనే ఆరోపణలున్నవారిని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం
మట్టి అక్రమంగా తవ్విన వారిపై కేసులు నమోదు చేస్తాం. మట్టిని సీజ్ చేసి విచారణ చేస్తాం. కొందరు వీఆర్ ఏలు తవ్వకాలపై సమాచారం ఇవ్వడం లేదు. వారిని మరింత అప్రమత్తం చేస్తాం. ప్రజల నుంచి ప్రతీ రోజు అర్ధరాత్రి వరకు పదుల సంఖ్యలో ఫోన్‌లు వస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరుగుతున్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించకుండా చట్టబద్దంగా చర్యలు తీసుంటాం. ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించాం. విచారణ జరిపించి మట్టి తవ్వకాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
-కిషోర్, తహసీల్దార్, మనోహరాబాద్ మండలం
Updated Date - 2020-11-13T10:00:46+05:30 IST