మామిడికి బూడిద రోగం
ABN, First Publish Date - 2020-03-16T07:32:45+05:30
మామిడి సాగు జిల్లాలో ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగుతోంది. పగలంతా విపరీతమైన ఎండలు.. రాత్రివేళల్లో మంచుతో కూడిన చలితో మామిడి సాగుకు ముప్పు వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.
కనుమరుగవుతున్న పూత
పిచికారీ చేసినా అదుపులోకి రాని వైనం
ఆందోళన చెందుతున్న రైతులు
గణనీయంగా తగ్గిన మామిడిసాగు
ప్రతికూల పరిస్థితూలు కారణమే
మెదక్, మార్చి 15 : మామిడి సాగు జిల్లాలో ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగుతోంది. పగలంతా విపరీతమైన ఎండలు.. రాత్రివేళల్లో మంచుతో కూడిన చలితో మామిడి సాగుకు ముప్పు వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలతో పూత నేలరాలిందని రైతులు వాపోతున్నారు. గతేడాది కురిసిన వర్షం భూమిలో తేమ అధికమైంది. దాంతో ఆశించినంతగా మామిడిపూత పూయలేదు. దీనికితోడు బూడిదరోగం తెగులు సోకి పూతను తినేస్తుండగా రైతులు కీటక నాశిని మందులను పిచికారీ చేసినా అదుపులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, హవేళీఘణపూర్, చేగుంట, కాళ్లకల్, నిజాంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 8 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. మూడేళ్ల నుంచి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాదైనా లాభాలు వస్తాయని ఆశించినా మామిడి పూత రాలిపోవడంతో ఉసూరుమంటున్నారు. సాధారణంగా నవంబరు నెలాఖరుకే మామిడి చెట్లు పూత పూస్తాయి. కానీ మార్చి నెల సగం అయిపోయినా పూర్తిస్థాయిలో పూత రాకపోవడంతో రైతులు కలత చెందుతున్నారు. ఘణపూర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు అయిన ఎఫ్‌ఎన్, ఎంఎన్ కెనాళ్ల పరీవాహక ప్రాంతాల్లో మామిడి తోటల్లో నీటి వసతి ఉన్నా చెట్లు పూత పూయలేదు. తోటల్లో సస్యరక్షణ చర్యలు ఎరువు, పురుగు మందులను తరచుగా స్ర్పే చేస్తున్నా మార్పురావడం లేదని రైతులు వాపోతున్నారు.
రబ్బరు పురుగుతో భారీ నష్టం
మామిడి పూతను రబ్బరు పురుగు ఆశించడంతో జిల్లాలో భారీస్థాయిలో పంట నష్టం ఏర్పడనుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లాలోని శివ్వంపేట మండలంలో 300 ఎకరాల్లో మామిడి పంటకు రబ్బరు పురుగు, బూడిద తెగులు ఆశించాయి. అదేవిధంగా నిజాంపేట, రామాయంపేట, కౌడిపల్లి, తూప్రాన్, చేగుంట మండలాల్లో బూడిది తెగులు విస్తృతంగా మామిడి పంటను ఆశిస్తోంది. తెగులు నివారణకు ఇండోథ్రిన్, హిమోమ్యార్సిన్ బెంజోయెట్ మందును గ్రాము మోతాదులో తీసుకుని ఒక లీటరు ద్రావణంలో కలిపి పిచికారీ చేయాల్సిందిగా ఉద్యానవనశాఖ అధికారి అర్చన తెలిపారు. బూడిద రోగాన్ని నివారించడానికి లీటరు నీటిలో ఒక గ్రాము మైక్రో బుటారిన్ మందును కలిపి పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
దిగుబడి మేలో వస్తుందేమో
మామిడి పూత ఈయేడు ఆలస్యం కావడంతో తోటల్లో వచ్చిన అరకొర పూతతో కాసే కాయలు మే మొదటి వారానికి వస్తాయేమోనని రైతులు ఆశిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒకేసారి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేసవిలో వచ్చే ఈదురు గాలులు, గాలివానలకు మామిడికాయలు నేలరాలుతాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సీజన్ సరైన సమయంలో వస్తే టన్ను మామిడి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండేది. మే నెలలో దిగుబడులు వస్తే సగానికి ధర పడిపోతుందని వాపోతున్నారు. అదీకాకుండా కూలీల కొరతా తీవ్రంగా ఉంటోంది.
ఈ యేడు మామిడి సాగు రైతులకు ఇబ్బందే.. నర్సయ్య, జిల్లా ఉద్యాన వన అధికారి
వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా మామిడి సాగు రైతులకు ఈయేడు ఆశించినంతగా పంట దిగుబడి వచ్చే అవకాశం లేదు. వచ్చి పూత రాలుతుండడంతో ఉన్నవాటిని కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎరువులు, పురుగు మందులను తరచూ పిచికారీ చేస్తే రబ్బరు పురుగు, బూడిద రోగం అదుపులోకి వస్తుంది.
Updated Date - 2020-03-16T07:32:45+05:30 IST