ప్లీజ్.. నా కొడుకును కాపాడండి.. కిడ్నీ వ్యాధి.. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కూడా..
ABN, First Publish Date - 2020-11-13T21:37:16+05:30
ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న మధ్య తరగతి కుటుంబాన్ని విధి వంచించింది. కూతురికి కిడ్నీలు పాడై మృతిచెందగా, కుమారుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీనికి తోడు కిడ్నీల సమస్య వేధిస్తున్నది. అనుకోకుండా మంచంపై నుంచి పడి మరో కాలు విరిగిపోయింది.
రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన బాలుడు
మరో కాలుకు సర్జరీ అవసరం
కిడ్నీ వ్యాధితోనూ బాధపడుతున్న హరికృష్ణ
సాయం చేసి ఆదుకోవాలని తండ్రి వేడుకోలు
రేగోడు/మెదక్ (ఆంధ్రజ్యోతి): ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న మధ్య తరగతి కుటుంబాన్ని విధి వంచించింది. కూతురికి కిడ్నీలు పాడై మృతిచెందగా, కుమారుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దీనికి తోడు కిడ్నీల సమస్య వేధిస్తున్నది. అనుకోకుండా మంచంపై నుంచి పడి మరో కాలు విరిగిపోయింది. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తూ సాయం కోసం ఓ తండ్రి వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రేగోడు మండలంలోని మర్పల్లి గ్రామానికి చెందిన బండి జనార్దన్‌కు రెండెకరాల భూమి ఉంది. రేగోడులో మొబైల్ రిపేరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు మొదటి అమ్మాయి రామలక్ష్మి పదో తరగతి వరకు రేగోడు మోడల్ పాఠశాలలో చదివింది. పాలిటెక్నిక్ అందోల్ కాలేజీలో చేరింది. అదే సమయంలో రామలక్ష్మి అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చూపించగా రెండు కిడ్నీలు పాడినట్లు వైద్యులు చెప్పారు. మొబైల్ షాప్ అమ్మేసి హైదరాబాద్‌లో ఉంటూ డయాలసిస్ చేయించారు. రూ.4 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2018లో రామలక్ష్మి మృతి చెందింది. ఇదిలా ఉండగా కుమారుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి కాలును కోల్పోయాడు. అప్పట్లోనే వైద్య ఖర్చుల కింద తనకున్న భూమిని అమ్మారు. ఉన్న ఒక్క కాలుతో రెండు కర్రల సహాయంతో పాఠశాలకు హరికృష్ణ వెళ్లే వాడు. అంతలోనే అతడికి కిడ్నీ సమస్య వచ్చింది. వైద్యులు కిడ్నీలను మార్చాలంటూ వారికి పిడుగు లాంటి వార్త చెప్పారు. ఇటీవలే హరికృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంచం పైనుంచి కింద పడిపోవడంతో రెండో కాలు విరిగింది. హైదరాబాద్‌లోని ఓ పైవ్రేట్ ఆస్పత్రిలో చూపించగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు.
దాతలు కాపాడాలని వేడుకోలు
ఓ వైపు కిడ్నీల సమస్య మరోవైపు ఉన్న ఒక్క కాలు విరిగి అవస్థ పడుతున్న హరికృష్ణకు చికిత్స అందించేందుకు దాతలు ముందుకు వచ్చి కాపాడాలంటూ తండ్రి బండి జనార్దన్ వేడుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, కాలు ఆపరేషన్ కోసం వైద్య ఖర్చులు కింద రూ.లక్ష పైనే కావాలని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. తమ వద్ద డబ్బు లేదని, దాతలు సాయం చేయాలని జనార్దన్ ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా వేడుకున్నాడు. 9542825496 నంబర్‌కు దాతలు గూగుల్ పే, ఫోన్ పే చేసి సహాయపడాలని కోరారు.
Updated Date - 2020-11-13T21:37:16+05:30 IST