మొరాయించిన ధరణి
ABN, First Publish Date - 2020-11-03T11:19:34+05:30
ధరణి వెబ్‌సైట్‌కు సాంకేతిక పరమైన సమస్యలు తప్పడం లేదు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు ఇక పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణిని అక్టోబరు 29న సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి
సర్వర్ డౌన్‌తో ఓపెన్ కాని ధరణి వెబ్‌సైట్
వ్యవసాయ భూముల రిజిస్ట్ర్టేషన్లకు ఇబ్బందులు
తొలిరోజు అనేక ప్రాంతాల్లో ప్రక్రియకు బ్రేక్
స్లాట్ బుకింగ్‌కూ తప్పని తప్పలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)
ధరణి వెబ్‌సైట్‌కు సాంకేతిక పరమైన సమస్యలు తప్పడం లేదు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు ఇక పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణిని అక్టోబరు 29న సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాంకేతిక సమస్యలతో సర్వర్ పనిచేయకపోవడంతో ఐదురోజుల పాటు గడువు ఇచ్చి ఈ నెల 2 నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ ఐదురోజుల గడువులో ధరణి ద్వారా రిజిస్ర్టేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో మారుమూల ప్రాంతాలైన నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్‌కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.
తొలిరోజు సర్వర్ సమస్య
ఇలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈనెల 2న ప్రారంభించాల్సి ఉండగా కొన్ని మండలాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో జాప్యం ఏర్పడింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అధికారం పొందిన తహసీల్దార్లు ఉదయం పదిన్నర గంటలకు ధరణి వెబ్‌సైట్ కోసం ప్రయత్నించగా గంట, రెండు గంటల తర్వాత తెరుచుకున్నది. కలెక్టర్ వెంకట్రామారెడ్డి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ను ప్రారంభించేందుకు నిర్ణీత సమయానికి కంది తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సర్వర్ పనిచేయక, ధరణి వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో 12 గంటలకు కలెక్టర్ రిజిస్ర్టేషన్లను ప్రారంభించారు.
13 రిజిస్ట్రేషన్లు
ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు గతనెల 29 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 43 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. తొలిరోజైన 2వ తేదీన 43 మందిలో 13 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 20 మంది వ్యవసాయ భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు ప్రాసె్‌సలో ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది ఒకే సమయానికి వెబ్‌సైట్ ఓపెన్ చేసి, రిజిస్ర్టేషన్ల ప్రక్రియ మొదలుపెట్టడంతో సాంకేతిక ఇబ్బందులతో సర్వర్ మొరాయించింది. మరో పదిమంది రిజిస్ర్టేషన్లను 3వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది.
స్లాట్ బుకింగ్‌కూ సమస్యే
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేయించుకోవడానికి సాంకేతిక సమస్య ఏర్పడింది. స్లాట్ బుకింగ్‌కు తేదీ రావడం లేదు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌కు చెందిన తుకారాం తన ఎకరా ఇరవై గుంటల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం సోమవారం మీ-సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ధరణి వెబ్‌సైట్‌లో వివరాలన్నీ నమోదు చేసుకున్నాక.. స్లాట్ బుకింగ్ వరకు రాగానే తేదీ నమోదు కాలేదు. తన భూమి ఎప్పుడు రిజిస్ర్టేషన్ అవుతుందో తెలియడం లేదని తుకారాం తెలిపాడు.
Updated Date - 2020-11-03T11:19:34+05:30 IST